ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను మరింత వేగవంతం చేస్తోంది. డ్రగ్స్ నియంత్రణ, అక్రమ రవాణాకు అడ్డుకట్ట, యువతలో అవగాహన పెంపు వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన ఉండవల్లిలో మంత్రుల బృందం సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పనిచేస్తేనే మాదకద్రవ్యాల నియంత్రణలో ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు మంత్రుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్ణయించారు.
విద్యార్థులు, యువతపై ప్రత్యేక దృష్టి
డ్రగ్స్ ప్రభావం నుంచి యువత, విద్యార్థులను రక్షించేందుకు బహుముఖ కార్యాచరణ అవసరమని లోకేశ్ సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ‘ఈగల్ క్లబ్’లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా విద్యార్థుల్లో మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంచాలని సూచించారు.
గిరిజన ప్రాంతాల్లో అమలు చేస్తున్న ‘ఆపరేషన్ చైతన్యం’, విద్యాసంస్థల పరిసరాల్లోని ‘సేఫ్ క్యాంపస్ జోన్’, యువతను ఉద్దేశించి చేపడుతున్న ‘డ్రగ్స్ వద్దు బ్రో’ వంటి కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
యూనివర్సిటీలు, కాలేజీల్లో విద్యార్థులతో ప్రతి నెలా టౌన్‌హాల్ సమావేశాలు నిర్వహించి డ్రగ్స్ దుష్ప్రభావాలు, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరంపై అవగాహన కల్పించాలని సూచించారు.
విశాఖలో దక్షిణాది రాష్ట్రాల కాంక్లేవ్
డ్రగ్స్ నియంత్రణలో ఇతర రాష్ట్రాలతో సమన్వయం పెంచేందుకు త్వరలో విశాఖపట్నంలో దక్షిణాది రాష్ట్రాల కాంక్లేవ్ నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. అలాగే సింథటిక్ డ్రగ్స్ నియంత్రణ కోసం పంజాబ్ పోలీసులు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.
సరిహద్దుల్లో నిఘా మరింత కట్టుదిట్టం
ఒడిశా నుంచి రాష్ట్రంలోకి గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల వద్ద నిఘాను మరింత పెంచినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణాను గుర్తించేందుకు డ్రోన్ల వినియోగాన్ని కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు.
ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ‘బ్రేక్ ద సైలెన్స్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు హోంమంత్రి వివరించారు.
20 మెడికల్ షాపులపై చర్యలు
ఈగల్ ఐజీ ఆకె రవికృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇటీవల పట్టుబడిన గంజాయి చాక్లెట్లు బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు తెలిపారు. ఈ విషయంపై ఆయా రాష్ట్రాల అధికారులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు.
ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులను విక్రయిస్తున్న 20 మెడికల్ షాపులను సీజ్ చేసినట్లు వెల్లడించారు. విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల్లోని బ్లేడ్ బ్యాచ్‌లపై కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
డ్రగ్స్ గుర్తింపునకు 36 జాగిలాలు
మాదకద్రవ్యాల అక్రమ రవాణాను గుర్తించేందుకు ప్రత్యేక శిక్షణ పొందిన 36 జాగిలాలను పోలీసులు వినియోగిస్తున్నట్లు ఈగల్ ఐజీ తెలిపారు. అనుమానితులను గుర్తించేందుకు ర్యాపిడ్ డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 192 మంది పాత నేరస్థులను గుర్తించి, వారి కార్యకలాపాలపై నిఘా పెట్టినట్లు తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు అవసరమైన చోట కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మంత్రులు సత్యకుమార్ యాదవ్, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణితో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
also read: శివరాజ్ కుమార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. కళ్లముందే పేలిన బాణసంచా
