క్రైమ్ మిర్రర్ : గుజరాత్‌లోని కచ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. భుజ్-ఖవడా జాతీయ రహదారిపై వేగంగా వచ్చిన ట్రైలర్ లారీ ఓ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు రెండు ముక్కలుగా విడిపోయి పూర్తిగా ధ్వంసమైంది. కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పసిపాపలు, ఓ ఏడేళ్ల బాలిక ఉండటం అందరినీ కలచివేసింది.
శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో మృతులను రింకీ నితిన్ గుసైన్ (35), ఆమె కుమార్తె వామిక, సౌరభ్ సింగ్ నేగి (30), ఆయన భార్య సవిత (30), వారి కుమార్తె సివిక, రాజేష్ రావత్ (35), ఆయన కుమార్తె రక్షిత (7)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద ధాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జు కావడంతో అందులో చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీసేందుకు సిబ్బంది గంటల తరబడి శ్రమించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మృతులంతా ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్ ప్రాంతానికి చెందినవారు. భుజ్‌లో విధులు నిర్వహిస్తున్న సైనిక సిబ్బంది కుటుంబ సభ్యులుగా అధికారులు వెల్లడించారు. రన్ ఆఫ్ కచ్‌ను సందర్శించి తిరిగి భుజ్‌కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. ఒకే ప్రమాదంలో ఏడు ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
also read : వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
