రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును భక్తులతో ప్రయాణిస్తున్న వాహనం బలంగా ఢీకొట్టడంతో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉండటం కలచివేస్తోంది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
కోటా జిల్లాలోని నాటా పోలీస్ స్టేషన్ పరిధిలో, కోటా-ఉదయ్‌పూర్ జాతీయ రహదారిపై శంభుపుర గ్రామం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. సికార్ జిల్లాలోని ప్రసిద్ధ ఖాటూ శ్యామ్ జీ ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు మహారాష్ట్రకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు వాహనం పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో మరణించిన తొమ్మిది మందీ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అంబులెన్సుల్లో సమీప ఆసుపత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని కోటా మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.
కాగా, రాజస్థాన్‌లో ఇటీవల కూడా ఇలాంటి ఘోర ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. బార్మర్ సమీపంలో డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న డంపర్‌ను వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఓపెన్ జైలు ఖైదీలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఖాటూ శ్యామ్ ఆలయానికి వెళ్తున్న మధ్యప్రదేశ్ భక్తుల వాహనం లోయలో పడటంతో ఎనిమిది మంది మరణించారు. వరుస ప్రమాదాలతో భక్తుల ప్రయాణ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.
also read: పెళ్లైన మరుసటి రోజే మృతశిశువుకు జన్మనిచ్చిన నవవధువు.. వరుడి ఫిర్యాదుతో విషయం వెలుగులోకి
