క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల పరిషత్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు మరోసారి కూటమి ప్రభుత్వానికి అద్భుతమైన విజయాన్ని అందించారని ఆయన కొనియాడారు. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించగా, తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఏకంగా 96.4 శాతం స్ట్రైక్ రేట్‌తో కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించడం చారిత్రాత్మకమని సీఎం పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈ పరిషత్ ఎన్నికల్లో కూటమికి 3.6 శాతం ఓట్లు అదనంగా పెరిగాయని చంద్రబాబు గణాంకాలతో సహా వివరించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీ (గొడ్డలి పార్టీ) ఓట్ల శాతం 39.8 శాతం నుండి 33.5 శాతానికి పడిపోయిందని, తద్వారా ఆ పార్టీ 6 శాతానికి పైగా ఓట్లను కోల్పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసానికి, ఆదరణకు ఈ ఫలితాలే నిదర్శనమని స్పష్టం చేశారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయిన సందర్భంగా, తమ పాలనకు ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పు ఇది అని చంద్రబాబు అభివర్ణించారు. గతంలో ప్రతిపక్షాలు ఈవీఎమ్‌ల పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆరోపణలు చేశాయని, అయితే ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ ప్రజలు కూటమికే పట్టం కట్టారని ఆయన గుర్తు చేశారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా, పోస్టల్ బ్యాలెట్ అయినా ఎన్నికల విధానం ఏదైనా అంతిమ విజయం కూటమిదేనని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు పూర్తిగా సమర్థిస్తున్నారని ఈ ఫలితాలు నిరూపించాయని చంద్రబాబు తెలిపారు. ఈ ఘనవిజయానికి కృషి చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపిస్తామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
