Homeజాతీయంఅందం కోసం ఆరాటం.. మేకప్ క్రీములు ప్రాణాలకే ప్రమాదం!

అందం కోసం ఆరాటం.. మేకప్ క్రీములు ప్రాణాలకే ప్రమాదం!

సోషల్ మీడియా ప్రభావం నేటి యువతపై ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోలలో ఇన్‌ఫ్లుయెన్సర్లు చేసే ప్రచారాలను గుడ్డిగా నమ్మి, నాణ్యత లేని బ్యూటీ ప్రొడక్ట్స్ వాడటం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల కేరళ రాష్ట్రంలో జరిగిన ఒక విషాదకర ఘటన ఇందుకు నిదర్శనంగా నిలిచింది.

కేరళలోని మలప్పురం జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలిక, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వచ్చిన ప్రకటనలు చూసి ఆకర్షితురాలైంది. త్వరగా తెల్లబడతామనే ఆశతో ఆన్‌లైన్‌లో ఒక బ్యూటీ క్రీమ్‌ను ఆర్డర్ చేసి వాడటం ప్రారంభించింది. అయితే, ఆ క్రీమ్ వాడిన కొద్ది రోజులకే ఆమె ఆరోగ్యం తీవ్రంగా క్షీణించింది. ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా, ఆమెకు ‘మెంబ్రేనస్ నెఫ్రోపతీ’ అనే తీవ్రమైన కిడ్నీ వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఆ బాలిక వాడిన బ్యూటీ క్రీమ్ నమూనాలను ల్యాబ్‌లో పరీక్షించగా, అందులో అత్యంత ప్రమాదకర స్థాయిలో ‘మెర్క్యురీ’ ఉన్నట్లు తేలింది. చర్మాన్ని త్వరగా తెల్లగా మార్చడానికి అనధికారిక తయారీదారులు ఇలాంటి విషపూరిత రసాయనాలను మోతాదుకు మించి కలుపుతున్నారు. ఈ క్రీమ్‌లను చర్మానికి రాసుకున్నప్పుడు, ఆ మెర్క్యురీ రక్తంలోకి చేరి నేరుగా కిడ్నీలు, నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఈ ఘటనపై కేరళ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించి, సుమోటోగా కేసు నమోదు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా, ఎటువంటి వైద్య ప్రమాణాలు లేకుండా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్న ఇలాంటి సౌందర్య సాధనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.ఈ సంఘటన ప్రతి ఒక్కరికీ ఒక కనువిప్పు కావాలి. కేవలం సోషల్ మీడియాలో వచ్చే రంగురంగుల ప్రకటనలు, ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి ఏది పడితే అది కొనుగోలు చేయకూడదు. ఏదైనా చర్మ సౌందర్య ఉత్పత్తిని వాడే ముందు దాని నాణ్యతను, అందులో వాడిన పదార్థాలను పరిశీలించాలి. ముఖ్యంగా చర్మవ్యాధి నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే క్రీమ్‌లను ఉపయోగించడం సురక్షితం.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు