రణ్‌బీర్ కపూర్, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’ చుట్టూ వివాదం మొదలైంది. ఈ సినిమాపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇతిహాసంలోని పాత్రలను చిత్రీకరిస్తున్న తీరుపై ఆ సంస్థ అసంతృప్తి వ్యక్తం చేసింది.
వీహెచ్‌పీ అంతర్జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్ ఈ సినిమా విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. రావణుడిని గొప్ప వ్యక్తిగా చూపించే ప్రయత్నం జరుగుతోందని, తద్వారా రామాయణంలోని అసలు సందేశాన్ని వక్రీకరించే ప్రమాదం ఉందని ఆయన ఆరోపించారు. ఇలాంటి చిత్రీకరణ హిందూ సంప్రదాయాలు, విలువలపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో ‘రామాయణ’ సినిమా స్క్రీనింగ్‌ను తక్షణమే నిలిపివేయాలని అలోక్ కుమార్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా సినిమాకు జారీ చేసిన సెన్సార్ సర్టిఫికెట్‌ను కూడా రద్దు చేయాలని కోరారు. రావణుడి పాత్రను ఏ విధంగా చూపించారనే అంశంపై నిర్మాతలు సమాధానం చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు.
ఇప్పటికే భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంపై వీహెచ్‌పీ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సినిమా చుట్టూ చర్చ మొదలైంది. ఈ వివాదంపై చిత్ర బృందం ఎలా స్పందిస్తుందో తద్వారా ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.
also read: విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు
