ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలలో వెలుగుచూసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గుప్తనిధుల కోసం పాఠశాల ఆవరణలో క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ ప్రారంభించారు.
బద్వేలు పట్టణంలోని సుందరయ్య కాలనీలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. గత కొన్ని నెలలుగా రాత్రి వేళల్లో పాఠశాల కార్యాలయంలో ఓ మాంత్రికుడి సహాయంతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కొందరు విద్యార్థులకు సంబంధించిన ఫొటోలు, వారి తల వెంట్రుకలను కూడా సేకరించినట్లు వారు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో పాఠశాల ప్రాంగణంలో తవ్విన గుంతలను పరిశీలించిన తల్లిదండ్రులకు వెంట్రుకలు, నిమ్మకాయలు, మాంసం, మద్యం సీసాలు కనిపించినట్లు వెల్లడించారు. దీంతో అక్కడ జరుగుతున్న వ్యవహారంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు.
తల్లిదండ్రులు పాఠశాల నిర్వాహకులను నిలదీయడంతో వారు, పూజలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న అధికారులు దృష్టి సారించారు. మరోవైపు మండల విద్యాశాఖ అధికారి (ఎంఈవో) పాఠశాలను సందర్శించి వివరాలు సేకరించారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టారు.
విద్యార్థులు చదువుకోవాల్సిన పాఠశాలలో ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి రావడం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే పాఠశాలలో నిజంగా ఏం జరిగింది? గుంతల్లో లభించిన వస్తువుల వెనుక ఉన్న కారణాలేమిటి? అనే విషయాలు అధికారుల విచారణలో తేలాల్సి ఉంది.
also read: బెంగళూరులో ఘోరం.. సుత్తితో కొట్టి కొడుకును చంపిన తండ్రి..
