క్రైమ్ మిర్రర్ : ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌లో ఉన్న బిల్లులను మంజూరు చేయిస్తానని, నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఇద్దరి వద్ద నుంచి రూ.20.70 లక్షలు వసూలు చేసిన వ్యక్తి మోసం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మెదక్ పట్టణ ఇన్స్పెక్టర్ డి. మహేష్ వెల్లడించారు.
మెదక్ పట్టణానికి చెందిన ఆర్ అండ్ బి కాంట్రాక్టర్ శివరాములుకు అలకంటి యశ్వంత్ పరిచయమయ్యాడు. తాను తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్నానని, ప్రభుత్వ ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని పరిచయం పెంచుకున్నాడు. సుమారు రూ.3 కోట్ల విలువైన పెండింగ్ బిల్లులను విడుదల చేయిస్తానని, ఇందుకు 10 శాతం కమీషన్ చెల్లించాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అతడి మాటలు నమ్మిన శివరాములు గత ఏడాది అక్టోబర్ 14న యశ్వంత్ తండ్రి బ్యాంకు ఖాతాకు రూ.10 లక్షలు పంపించాడు. అయితే బిల్లులు మంజూరు చేయించకపోగా, తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకుండా నిందితుడు తప్పించుకున్నాడు.
ఇదే తరహాలో నర్సాపూర్‌కు చెందిన దశరథ్ను ఆర్టీసీ బస్సులో పరిచయం చేసుకున్న యశ్వంత్, టీఎస్‌పీడీసీఎల్‌లో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో విడతలవారీగా రూ.10.70 లక్షలు తీసుకున్నాడు. ఉద్యోగం గురించి బాధితుడు నిలదీయడంతో నకిలీ నియామక ఉత్తర్వులను పంపించి నమ్మించే ప్రయత్నం చేశాడు.
ఇలా ఇద్దరు బాధితుల నుంచి మొత్తం రూ.20.70 లక్షలు వసూలు చేసి సొంత అవసరాలకు ఖర్చు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని, పెండింగ్ బిల్లులు మంజూరు చేయిస్తామని చెప్పే వ్యక్తుల మాటలు నమ్మి ఎవరికీ ముందుగానే డబ్బులు ఇవ్వవద్దని సీఐ మహేష్ ప్రజలకు సూచించారు. ఇలాంటి మోసాలకు గురైన వారు ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
also read : ఆర్థిక చిక్కుల్లో బండ్ల గణేష్…!చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష…
