వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి గుంటూరు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. వెంగళాయపాలెం బ్యాలెట్ బాక్సుల వివాదానికి సంబంధించిన కేసులో ఆయనను మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో త్వరలోనే నల్లపాడు పోలీసులు ఆయనను తమ కస్టడీలోకి తీసుకుని విచారణ చేపట్టనున్నారు.
గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలో స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం బ్యాలెట్ బాక్సుల తరలింపు సమయంలో వివాదం నెలకొంది. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు, బ్యాలెట్ బాక్సును బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారనే ఆరోపణలు అప్పిరెడ్డిపై వచ్చాయి. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసిన నల్లపాడు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. అనంతరం న్యాయస్థానం రిమాండ్ విధించడంతో అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్నారు.
కేసు దర్యాప్తును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అప్పిరెడ్డిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావించారు. ఈ క్రమంలో ఆయనను తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ గుంటూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల అభ్యర్థనను పరిశీలించిన న్యాయస్థానం మూడు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ విచారణలో కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను పోలీసులు సేకరించనున్నారు.
ఇదిలా ఉంటే, ఈ కేసులో బెయిల్ పొందేందుకు అప్పిరెడ్డి తరఫు న్యాయవాదులు కూడా కోర్టును ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు ఇప్పటికే పూర్తయ్యాయి. అయితే, తుది నిర్ణయాన్ని న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నవంబర్ 25న బెయిల్ పిటిషన్‌పై తీర్పు వెల్లడించనున్నట్లు కోర్టు తెలిపింది.
ఒకవైపు పోలీస్ కస్టడీకి అనుమతి లభించడం, మరోవైపు బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడటంతో లేళ్ల అప్పిరెడ్డి కేసు రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది.
also read: గాంధీ ఆస్పత్రిలో ఏడు రోజుల పసికందు కిడ్నాప్.. ఆరుగురి అరెస్ట్
