హైదరాబాద్, క్రైమ్మిర్రర్: అమెరికాలో శనివారం (ఈ రోజు)జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడు. ఉద్యోగ అన్వేషనలో ఉన్న యువకుడు వారం క్రితమే ఉద్యోగం సాధించాడు. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కాగా నల్గొండ జిల్లాలోని మునుగోడుకు చెందిన ఈరమళ్ల ప్రసాద్, శ్రీకన్య దంపతుల కుమారుడు సాయితేజ(25) ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లాడు. చదువు పూర్తయ్యాక ఉద్యోగం వారం క్రితమే వచ్చింది.
ఈ క్రమంలో సాయితేజ కారులో ప్రయాణిస్తుండగా ఓ జింక అడ్డు వచ్చింది. దీంతో అతడు ఒక్కసారిగా కారు ఆపగా .. వెనుక నుంచి సరకు రవాణా వ్యాన్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో సాయితేజ అక్కడికక్కడే మృతి చెందాడు. సాయితేజ మృతితో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. ఆదివారం రాత్రికి అతడి మృతదేహం భారత్కు వచ్చే అవకాశాలున్నాయి. కాగా ఈ ప్రమాదంలో మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హెలికాప్టర్లో సహాయంతో పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
