కర్ణాటక రాజధాని బెంగళూరులో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కన్న కొడుకును అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఓ వ్యక్తి, తన భార్యపై కూడా ప్రాణాంతక దాడికి పాల్పడ్డాడు. ఆమె తీవ్ర గాయాలతో ఉన్నప్పటికీ గదిలో బంధించి మూడు రోజుల పాటు బయటకు రానివ్వకుండా చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరులోని పద్మనాభనగర్‌కు చెందిన సుదీప్ అనే వ్యక్తి ఈ నెల 16న తన కుమారుడు సోహమ్ దాస్‌పై సుత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం తన భార్య సీమా దాస్‌పై కూడా విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆ తర్వాత ఆమెను ఓ గదిలో బంధించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మూడు రోజుల పాటు గదిలోనే చిక్కుకుపోయిన సీమా దాస్ పరిస్థితిని గుర్తించిన అపార్ట్మెంట్ యజమాని మల్లయ్య ఈ నెల 19న పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టి లోపల ఉన్న సీమాను రక్షించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు ఈ ఘటనకు పాల్పడిన సుదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
also read: విషాదం.. నూడుల్స్ తిన్న ఏడేళ్ల బాలిక మృతి! మరో బాలికకు అస్వస్థత
