-
విజయ్ గెలుపుతో ఏపీలో సంబరాలు
-
ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అంటూ డిప్యూటీ సీఎం హాట్ కామెంట్స్
-
పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో : ఏపీలో పొత్తులు ఉంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నష్టం. రాష్ట్ర అభివృద్ధి కోసం మరో 15 సంవత్సరాలు పొత్తు దిశగా అడుగులు వేస్తామంటున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. తమ పార్టీల శ్రేణులకు గట్టిగానే పిలుపునిస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం పొత్తు కొనసాగిస్తామని తేల్చి చెబుతున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నిద్ర పట్టని పరిస్థితి. అందుకే ఆ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. మొన్నటికి మొన్న తమిళనాడులో విజయ్ గెలుపుతో.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకుంది.
ఒంటరి పోరాటం అన్న అంశంపై సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పై ట్రోల్ చేసింది. అప్పటికే అనారోగ్యంతో ఉన్నారు పవన్ కళ్యాణ్. కానీ జనసేన విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన పవన్ కళ్యాణ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇచ్చి పడేశారు. జన సైనికులకు బలమైన దిశా నిర్దేశం చేశారు.తమిళనాడు విజయ్ పార్టీపై కూడా పవన్ ఆసక్తికరంగా స్పందించారు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు కొందరి తీరు ఉందని ఎద్దేవా చేశారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితులు… ఏపీలో రాజకీయ పరిస్థితులు వేరని.. తాను ఒంటరిగా పోటీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. 11 సీట్లు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా అంటూ ఒక్క మాటతో తేల్చేశారు.
పక్కా పొలిటికల్ క్లారిటీతో…
పవన్ కళ్యాణ్ ఇప్పుడు పక్కా పొలిటికల్ క్లారిటీతో కనిపిస్తున్నారు. గతంలో మాదిరిగా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం లేదు. ముఖ్యంగా భావోద్వేగ నేత అనే ముద్రను చెరిపేశారు. రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒంటరి పోరాటం పేరుతో రాజకీయ ప్రత్యర్థి ఆడుతున్న గేమ్ ను గుర్తించారు. దానిని పార్టీ శ్రేణులకు గుర్తు చేస్తూ వారి ట్రాప్ లో పడవద్దు అని సూచిస్తున్నారు.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తనను ఒక కులానికే పరిమితం చేయాలని చేస్తున్న కుట్రను కూడా గమనించారు. వాస్తవానికి పవన్ తనను తాను ఒక కులనేతగా ఎప్పుడూ చెప్పుకోలేదు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం పవన్ ను ఆచక్రంలోనే ఉంచాలని ప్రయత్నిస్తోంది. కాపుల కోసం ఏం చేసావని అడిగే వైసిపి నేతలకు సమానంగా.. తాను కేవలం ఒక వర్గం కోసమే కాకుండా.. మొత్తం దేశం కోసం, వ్యవస్థ కోసం పనిచేయడానికి వచ్చానని పవన్ స్పష్టం చేశారు. తనపై కాపు ముద్ర వేయాలన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడను చిత్తు చేశారు.
కాపు కుల ప్రస్తావన తెస్తూ…
అంబటి రాంబాబు అరెస్టు సమయంలో కాపు పేరు చెప్పి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేసింది. ఏకంగా వంగవీటి రంగా సరసన అంబటి రాంబాబును చేర్చింది. దీనిపై పవన్ విరుచుకుపడ్డారు. రంగా ఆపదలో ఉన్నప్పుడు రక్షించుకోలేని వారు.. నేడు ఆయన చనిపోయిన తర్వాత ఆయన పేరుతో కథలు చెబుతున్నారని గాలి తీసేశారు. ఇతరుల ట్రాప్ లో పడి మనం కూడా అలానే అరవాల్సిన అవసరం లేదని…. మన సిద్ధాంతాలతోనే వారికి గట్టి సమాధానం చెప్పాలని జన సైనికులకు దిశా నిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్. మనల్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ బలహీన పరచాలని చూస్తోందో.. దానినే ఒక పాయింట్ గా తీసుకోవాలని పిలుపునిచ్చారు