Homeక్రైమ్ఎస్ఐ కృష్ణారెడ్డిపై ఉన్నతాధికారుల వేటు!

ఎస్ఐ కృష్ణారెడ్డిపై ఉన్నతాధికారుల వేటు!

  • క్రైమ్ మిర్రర్ కథనానికి విపరీతమైన స్పందన.

  • ​కొత్త ఎస్ఐగా మిర్యాలగూడ టూ టౌన్ నుండి రాంబాబు నియామకం.

  • ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం త్వరలోనే బాధ్యతల స్వీకరణ

నల్గొండ నిఘా (క్రైమ్ మిర్రర్ ప్రతినిధి): మర్రిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గత కొంతకాలంగా సాగుతున్న ఖాకీ అరాచకాలు, అవినీతి అక్రమాలు, శాంతిభద్రతల క్షీణతపై ‘క్రైమ్ మిర్రర్’ పత్రిక నిష్పక్షపాతంగా, సాక్ష్యాధారాలతో ప్రచురించిన వరుస కథనాలకు ఉన్నతాధికారుల నుండి స్పందన లభించింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి, బాధితులపైనే అక్రమ కేసులు బనాయిస్తూ, పోలీస్ స్టేషన్‌ను అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మార్చారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) కృష్ణారెడ్డిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఆయనను తక్షణమే ఆ బాధ్యతల నుండి తొలగిస్తూ, ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మిర్యాలగూడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి సమర్థుడైన అధికారిగా పేరుపొందిన ఎస్ఐ రాంబాబును మర్రిగూడకు బదిలీ చేస్తూ, జిల్లా పోలీస్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఉన్నతాధికారుల ఉత్తర్వుల ప్రకారం ఎస్ఐ రాంబాబు త్వరలోనే ఇక్కడ బాధ్యతలు స్వీకరించనున్నారు.

మర్రిగూడ మండల కేంద్రంగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా, మట్టి మాఫియా, పేకాట శిబిరాల నిర్వాహకుల నుండి పెద్ద ఎత్తున మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎస్ఐ కృష్ణారెడ్డిపై బలంగా వినిపించాయి. లెంకలపల్లి పేకాట కేసులో నిందితులకు విముక్తి కల్పించేందుకు ఒక మాజీ ప్రజాప్రతినిధి ఖాతా ద్వారా యాభై వేల రూపాయల నగదు బదిలీ జరిగిందని, ఆ మొత్తాన్ని ఒక బీజేపీ లీడర్ ఖాతా నుండి మార్చుకున్నారనే సంచలన నిజాన్ని సైతం ‘క్రైమ్ మిర్రర్’ వెలుగులోకి తెచ్చింది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి, వారిని మానసికంగా వేధిస్తూ, స్థానిక హోటళ్లలో తాము తిన్న ఫుడ్ బిల్లులను కూడా బాధితుల చేత కట్టించే స్థాయికి ఇక్కడి పోలీస్ వ్యవస్థ దిగజారిందనే వాస్తవాలను క్రైమ్ మిర్రర్ ఆధారాలతో సహా నిలదీసింది.

వెంకేపల్లి తండాకు చెందిన ఒక వ్యక్తి తన కుమారుడిని సాక్షిగా పెట్టుకుని, సెల్ఫీ కన్నీటి పర్యంతమవుతూ, ఆత్మహత్య చేసుకున్న హృదయవిదారక ఘటనపై ప్రాథమిక దర్యాప్తును పక్కనబెట్టి, బాధితుల పక్షాన నిలిచిన 15 మంది అమాయక గిరిజన యువకులపై, అక్రమ కేసులు నమోదు చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అలాగే భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి జరుపుకున్న యువకులపై డీజే నెపంతో కేసులు పెట్టడం, లెంకలపల్లిలో జరిగిన ఘోరాలపై నిరసన తెలిపిన సామాన్య ప్రజలపై కక్షసాధింపు చర్యలకు దిగడం వంటి సంఘటనలను ‘క్రైమ్ మిర్రర్’ ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు తెచ్చింది.

​ఈ అరాచక పాలనపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యంలో బాధితులను వేధించే అధికారులకు తావులేదని, సదరు అధికారిని తక్షణమే విధుల నుండి తొలగించాలని జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి డిమాండ్ చేశారని తెలుస్తుంది. క్రైమ్ మిర్రర్ రాసిన వరుస కథనాలు, ప్రజా ప్రతినిధుల ఒత్తిడి, ప్రజల నుండి వ్యక్తమైన తీవ్ర నిరసనలతో స్పందించిన ఉన్నతాధికారులు ఎస్ఐ కృష్ణారెడ్డిపై, శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ బదిలీ వేటు వేశారు. ​సరికొత్త ఆశలతో మర్రిగూడ ప్రజలు..
మిర్యాలగూడ టూ టౌన్ నుండి బదిలీపై వస్తున్న నూతన ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలోనైనా, మర్రిగూడలో శాంతి భద్రతలు తిరిగి అదుపులోకి వస్తాయని, అక్రమ దందాలకు, మాఫియాలకు అడ్డుకట్ట పడుతుందని మండల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సామాన్యుడికి రక్షణ కవచంగా నిలవాల్సిన పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో పోయిన నమ్మకాన్ని కొత్త ఎస్ఐ పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నారు. ​ప్రజల పక్షాన నిలబడి, అన్యాయాలను ఎండగడుతూ ‘క్రైమ్ మిర్రర్’ ప్రచురించిన సత్య నిరూపణ కథనాలే ఈ మార్పుకు కారణమని, పత్రికా స్వేచ్ఛకు, నిజాయితీ గల జర్నలిజానికి దక్కిన విజయమిదని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

– నిఘా వ్యవస్థ నిద్రిస్తే … క్రైమ్ మిర్రర్ కాపుగస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు