-
కే.కేశవరావు నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమిటీ
-
మాట నిలబెట్టుకున్న రేవంత్ సర్కార్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు సంబంధించి దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. ఉద్యమకారులను అధికారికంగా గుర్తించి.. వారి త్యాగాలకు తగిన గౌరవం కల్పించేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి గౌరవిస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు చర్యలు ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి మేలు చేస్తామని హామీ ఇచ్చారు. దీనిపై తెలంగాణ ఉద్యమకారుల కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
పట్టించుకోని కెసిఆర్ సర్కార్…
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది ప్రాణాలను త్యాగం చేశారు. ఉద్యమ నేపథ్యంలో ఆవిర్భవించిన టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ ఉద్యమకారులను గుర్తించడంలో విఫలమయింది అనే ఆరోపణలు ఎదుర్కొంది. అందుకే రేవంత్ ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఇప్పుడు ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించారు. రాజకీయంగా దగ్గరగా ఉన్నవారికి గుర్తింపు దక్కిందన్న విమర్శలు ఉన్న సమయంలో.. క్షేత్రస్థాయిలో ప్రతి ఉద్యమకారుడుని గౌరవించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా సీనియర్ నేత కే కేశవరావు చైర్మన్గా.. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ వంటి ఉద్యమ మూలాలు ఉన్న నేతలకు చోటు కల్పించారు.
బంగారు తెలంగాణతో పక్కకు…
తొలుత ఉద్యమ తెలంగాణ నినాదంతో అధికారాన్ని దక్కించుకుంది తెలంగాణ రాష్ట్ర సమితి. తరువాత బంగారు తెలంగాణ అన్న నినాదంతో ముందుకు సాగిన కేసీఆర్ సర్కార్.. ఉద్యమకారులను విస్మరించిందని ఆరోపణలు ఉన్నాయి. అసలు ఉద్యమంతో సంబంధం లేని వారికి పదవులు ఇచ్చి.. కేసులతో పాటు దెబ్బలు తిన్నవారికి గాలికి వదిలేసారన్న అసంతృప్తి ఉద్యమ శ్రేణుల్లో బలంగా ఉంది. కవిత సైతం ఒక సందర్భంలో ఉద్యమకారులకు సరైన గుర్తింపు ఇవ్వలేకపోయామని క్షమాపణలు కూడా చెప్పారు. అందుకే రేవంత్ సర్కార్ ఈ తప్పులను సరిదిద్ది.. నిజమైన ఉద్యమకారులను వెలికి తీసే బాధ్యతను ఆ కమిటీకి అప్పగించింది.
ఉద్యమ నేపథ్యం ఉన్న నేతలతో…
ఉద్యమ నేపథ్యం ఉన్న నేతలతో ఈ కమిటీ నియమించడం నిజంగా శుభపరిణామం. ఇదేదో నామమాత్రపు కమిటీ కాదు. ఉద్యమ సమయంలో నమోదైన కేసులు, జైలు శిక్షలు, చురుగ్గా పాల్గొన్న సంఘటనల ఆధారంగా అర్హులను ఎంపిక చేయనుంది. ఎవరెవరు తెలంగాణ ఉద్యమకారులు అనే అంశంపై ఒక సమగ్ర జాబితాను సిద్దరం చేయడం ఈ కమిటీ ప్రధాన బాధ్యత. కేవలం గుర్తింపు కార్డులు మాత్రమే ఇవ్వడమే కాదు.. ప్రభుత్వ పరంగా ఉద్యమకారులకు కల్పించాల్సిన గౌరవ మర్యాదలు, ఇతర సౌకర్యాలపై కూడా ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. పెన్షన్లు, బస్సు పాసులు, వైద్య సదుపాయాలు వంటి వాటిని ఉద్యమకారులకు కల్పించే అవకాశం ఉంది