-
విశాఖ రైల్వే జోన్ కు గెజిట్ నోటిఫికేషన్
-
మొదలుకానున్న కార్యకలాపాలు
-
ఉత్తరాంధ్ర ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 1 నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని స్పష్టం చేసింది. విభజన హామీల్లో భాగంగా ఇప్పటికే విశాఖ కేంద్రంగా దక్షిణ మధ్య కోస్తా రైల్వే జోన్ కేటాయిస్తూ అధికారిక అనుమతులు ఇచ్చింది. మరోవైపు రైల్వే జోన్ భవనాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన కూడా చేశారు. ఇప్పుడు ఏకంగా గెజిట్ నోటిఫికేషన్ జారీతో విశాఖ జోన్ కార్యకలాపాలు మొదలు అవుతాయి. నిజంగా ఇది ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న పరిణామం ఇది.
విభజన హామీగా..
2014లో రాష్ట్ర విభజన జరిగింది. అప్పట్లోనే ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తామని విభజన హామీల్లో పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే తోపాటు ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ల పరిధిలో ఎక్కువగా ఏపీ ఉండేది. అయితే విభజన హామీల్లో భాగంగా విశాఖ కేంద్రంగా సౌత్ సెంట్రల్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. 2019 ఫిబ్రవరిలో ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఇంతలో ఎన్నికలు వచ్చాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే రైల్వే జోన్ కు భూముల కేటాయింపులో చాలా జాప్యం జరిగింది. దీంతో రైల్వే జోన్ అంశం అనేది మరుగున పడిపోయింది. దాని గురించి పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత..
2024 ఎన్నికల్లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే జోన్ అంశంలో కదలిక వచ్చింది. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎప్పటికప్పుడు కేంద్రంతో సంప్రదింపులు చేశారు. దీంతో విశాఖ కేంద్రంగా దక్షిణ మధ్య కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. పాలనాపరమైన అనుమతులు కూడా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వపరంగా రైల్వే జోన్ కు విశాఖలో భూముల కేటాయింపు కూడా పూర్తయింది. ప్రధాని నరేంద్ర మోడీ కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. ఇంకోవైపు రైల్వే జోన్ కార్యకలాపాలకు వీలుగా తాత్కాలిక భవనాలను కూడా ఎంపిక చేశారు. ఈ తరుణంలో రైల్వే జోన్ కార్యకలాపాలు అధికారికంగా జూన్ 1 నుంచి ప్రారంభించే వీలుగా గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది.
కొత్త జోన్ పరిధిలోకి డివిజన్లు..
విశాఖ రైల్వే జోన్ పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు రైల్వే డివిజన్లు కలిపారు. మరోవైపు వాల్తేరు డివిజన్ ను రద్దు చేశారు. కొత్తగా విశాఖ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు వాల్తేరు లో కొనసాగుతున్న కొన్ని ప్రాంతాలను విజయవాడ డివిజన్లో చేర్చారు. మిగతా ప్రాంతాలతో విశాఖ డివిజన్ ను ఏర్పాటు చేశారు. మరోవైపు ఈస్ట్ కోస్ట్ జోన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను తీసుకొచ్చి విశాఖ డివిజన్లో కలిపారు. అలాగే వాల్తేర్ డివిజన్లో అప్పట్లో ఉన్న కొన్ని ప్రాంతాలను రాయగడ కేంద్రంగా ఏర్పడిన కొత్త డివిజన్ పరిధిలో చేర్చారు. విశాఖ రైల్వే జోన్ తో కొత్త రైల్వే సర్వీసులు, నూతన నియామకాలు.. ఇలా అన్ని ప్రక్రియలు ప్రారంభం కానున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజలకు రవాణా భారం మరింత తగ్గనుంది. రైల్వే శాఖ పరంగా సేవలు మెరుగుపడనున్నాయి.