హైదరాబాద్ నగరంలో కొత్త తరహా సైబర్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో యువతకు పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ప్రచారం అవుతున్న “రెంట్-ఎ-బాయ్‌ఫ్రెండ్” ఆఫర్ల వెనుక పెద్ద మోసం దాగి ఉందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.
సోషల్ మీడియా వేదికగా కొత్త మోసం
ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో ఆకర్షణీయమైన పోస్టర్లు, ఆఫర్లతో యువతిని టార్గెట్ చేస్తున్నారు. “స్పెషల్ డిస్కౌంట్స్”, “డేట్ ప్యాకేజీలు” అంటూ ప్రకటనలు చేసి నమ్మకం కలిగిస్తున్నారు.
ప్యాకేజీల పేరుతో మోసం
సైబర్ నేరగాళ్లు వివిధ రకాల డేటింగ్ ప్యాకేజీలు అందిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. కాఫీ డేట్ – రూ.499, సినిమా డేట్ – రూ.1,249, షాపింగ్, ఈవెంట్లు, ఫంక్షన్లకు తోడుగా సేవలు అంటూ ఆఫర్ లు పెట్టేసరికి వాటిని చూసి ఆకర్షితులవుతున్న యువతను లక్ష్యంగా చేసుకుని మోసాలు చేస్తున్నారు.
AI ఫోటోలు – నమ్మించే ట్రిక్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో అందమైన యువకుల ఫోటోలు సృష్టించి, వాటిని ప్రొఫైల్‌లుగా ఉపయోగిస్తున్నారు. “ప్రైవసీ గ్యారంటీ” అంటూ నమ్మకం కలిగించి డబ్బులు వసూలు చేస్తున్నారు.
డబ్బులు తీసుకుని అకౌంట్ బ్లాక్
బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్ పేరుతో QR కోడ్లు లేదా డిజిటల్ వాలెట్ల ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. డబ్బులు పంపిన వెంటనే అకౌంట్‌ను బ్లాక్ చేసి మాయమవుతున్నారు.
బ్లాక్మెయిల్ ప్రమాదం
ఆన్లైన్ చాటింగ్ ద్వారా వ్యక్తిగత సమాచారం, ఫోటోలు సేకరించి తర్వాత బెదిరింపులకు, బ్లాక్‌మెయిల్‌కు దిగే అవకాశముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాను పిల్లలు ఎలా వినియోగిస్తున్నారు అనేదానిపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మోసపోతే వెంటనే ఇలా చేయండి
ఈ తరహా సైబర్ మోసాల్లో ఎవరైనా చిక్కుకున్నట్లయితే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. లేదా అధికారిక వెబ్సైట్: cybercrime.gov.in లో ఫిర్యాదు నమోదు చేయాలి.
also read: హైదరాబాద్‌లో నకిలీ నంబర్ ప్లేట్లపై కఠిన చర్యలు.. ఇప్పటికే పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు
