ఆస్కార్, గ్రామీ అవార్డులు అందుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌తో కలిసి పనిచేసిన అనుభవంపై బాలీవుడ్ సీనియర్ గేయ రచయిత సమీర్ అంజాన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రెహమాన్‌తో పనిచేయడం తన కెరీర్లో అత్యంత సవాలుతో కూడుకున్న అనుభవాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు.
కోమల్ నహ్తా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘గేమ్ ఛేంజర్స్: ది మ్యూజిక్ సిరీస్’ పాడ్‌కాస్ట్‌లో సమీర్ అంజాన్ ఈ విషయాలను పంచుకున్నారు. తాను ఏఆర్ రెహమాన్‌తో కలిసి కేవలం ఒకే ఒక్క చిత్రానికి పనిచేశానని, అది ‘ది లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్’ అని తెలిపారు. ఆ సినిమాలోని పాటలను పరిశీలిస్తే తాను ఎదుర్కొన్న సవాలు ఏంటో అర్థమవుతుందని చెప్పారు.
ముఖ్యంగా సినిమాలోని కొన్ని పాటల కోసం స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరులు చెప్పిన అసలు మాటలను ఆధారంగా తీసుకుని వాటిని పాటల రూపంలోకి మార్చాల్సి వచ్చిందని సమీర్ వివరించారు. చారిత్రక సందర్భం, అసలు భావోద్వేగం ఏమాత్రం దెబ్బతినకుండా వాటిని గీతాలుగా మలచడం చాలా కష్టమైన పని అని పేర్కొన్నారు.
అయితే ఆ సమయంలో ఎదురైన కష్టాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటే మాత్రం ఓ మధురమైన, సరదా జ్ఞాపకంలా అనిపిస్తుందని సమీర్ అంజాన్ తెలిపారు. ఏఆర్ రెహమాన్ సంగీతానికి తగ్గట్టుగా పదాలను అందించడం తనకు ప్రత్యేకమైన అనుభవంగా నిలిచిందని ఆయన చెప్పుకొచ్చారు.
1990వ దశకంలో హిందీ సినీ పరిశ్రమలో ప్రముఖ గేయ రచయితగా గుర్తింపు పొందిన సమీర్ అంజాన్.. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు పాటలు అందించారు. అత్యధిక సంఖ్యలో సినీ గీతాలు రాసిన గేయ రచయితగా ఆయన పేరు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ నమోదైంది.
also read: ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య: ప్రొఫెసర్‌పై కేసు, డీన్ పదవి నుంచి తొలగింపు
