Homeక్రైమ్బంగ్లాదేశ్‌లో భారత వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి.. చెరువులో లభించిన మృతదేహం!

బంగ్లాదేశ్‌లో భారత వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి.. చెరువులో లభించిన మృతదేహం!

క్రైమ్ మిర్రర్ : విదేశాల్లో వైద్య విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయాడు. బంగ్లాదేశ్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న జమ్ముకశ్మీర్‌కు చెందిన ఓ యువకుడు కనిపించకుండా పోయిన రెండు రోజుల తర్వాత విగతజీవిగా కనిపించాడు. మెడికల్ కాలేజీ సమీపంలోని చెరువులో అతడి మృతదేహాన్ని గుర్తించారు. కుమారుడి మరణవార్త విన్న తల్లి తీవ్ర మనోవేదనకు గురై ఆసుపత్రిలో చేరడం కుటుంబంలో మరింత విషాదాన్ని నింపింది.

కశ్మీర్ నుంచి బంగ్లాదేశ్‌కు వెళ్లిన విద్యార్థి..

జమ్ముకశ్మీర్‌లోని సోపోర్ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల అద్నాన్ అల్తాఫ్ బంగ్లాదేశ్‌లోని ఈస్టర్న్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చిన అతడు, సుమారు 15 రోజుల క్రితం తన తల్లితో కలిసి తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లాడు. అక్కడే తల్లి అతడితో ఉంటూ చదువుకు సంబంధించిన విషయాల్లో తోడుగా ఉంటోంది.

కాలేజీ నుంచి బయటకు వెళ్లి అదృశ్యం..

నవంబర్ 2న అద్నాన్ కాలేజీ క్యాంపస్ నుంచి బయటకు వెళ్లాడు. అనంతరం సమీపంలోని ఓ ఇండియన్ రెస్టారెంట్‌లో భోజనం చేసినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత అతడి ఆచూకీ తెలియకుండా పోయింది. ఎంత వెతికినా సమాచారం లభించకపోవడంతో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో ఢాకా-చటోగ్రామ్ జాతీయ రహదారికి సమీపంలోని మోనిపూర్ గ్రామంలో ఉన్న చెరువులో అద్నాన్ మృతదేహాన్ని గుర్తించారు. ఈ విషయం తెలిసి స్థానికంగా కలకలం రేగింది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు పోస్టుమార్టం నిమిత్తం కమిల్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు.

మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడా?

అద్నాన్ కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఈస్టర్న్ మెడికల్ కాలేజీ యాజమాన్యం వెల్లడించినట్లు సమాచారం. కుమారుడి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తల్లి కూడా అతడితో పాటు బంగ్లాదేశ్‌లో ఉంటున్నట్లు తెలిపింది. నవంబర్ 4 నుంచి జరగాల్సిన రెండో ప్రొఫెషనల్ ఎంబీబీఎస్ మైక్రోబయాలజీ పరీక్షలకు కూడా అద్నాన్ హాజరుకావాల్సి ఉందని కళాశాల వర్గాలు పేర్కొన్నాయి. అయితే అతడి మరణానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

కుమారుడి మరణవార్తతో తల్లి అస్వస్థత..

కళ్లముందే ఉండాల్సిన కుమారుడు విగతజీవిగా మారాడన్న వార్త తల్లిని తీవ్రంగా కలచివేసింది. ఈ విషాదాన్ని తట్టుకోలేక ఆమె తీవ్ర మనోవేదనకు గురై ఆసుపత్రిలో చేరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై స్వదేశంలో ఉన్న బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని విజ్ఞప్తి

అద్నాన్ మృతదేహాన్ని భారత్‌కు తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం, భారత దౌత్య అధికారులు సహకరించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. విదేశీ గడ్డపై కుమారుడిని కోల్పోయిన తల్లిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడంతో పాటు, మృతదేహాన్ని త్వరగా అప్పగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థి మృతికి దారితీసిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోస్టుమార్టం నివేదిక, అధికారుల విచారణ అనంతరం మరణానికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
also read : మీర్‌పేట్ జంట హత్యల కేసులో కీలక పరిణామం.. 24 గంటల్లో నిందితుడి అరెస్ట్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు