Homeక్రైమ్ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య: ప్రొఫెసర్‌పై కేసు, డీన్ పదవి నుంచి తొలగింపు

ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య: ప్రొఫెసర్‌పై కేసు, డీన్ పదవి నుంచి తొలగింపు

ఐఐటీ బాంబేలో బీటెక్ విద్యార్థి సాహిల్ వాకోడే (22) ఆత్మహత్య ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లను అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ డీన్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు ఐఐటీ బాంబే ప్రకటించింది. విద్యార్థి మృతికి కుల వివక్ష, మానసిక వేధింపులు కారణమయ్యాయని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఎనర్జీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న సాహిల్.. శుక్రవారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే రోజు నిర్వహించిన మిడ్-సెమిస్టర్ పరీక్ష సమయంలో చాట్‌జీపీటీ సహాయంతో సమాధానాలు రాస్తుండగా ఇన్విజిలేటర్‌గా ఉన్న ప్రొఫెసర్ సూర్యనారాయణ అతడిని గుర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

తన కుమారుడి మరణానికి ప్రొఫెసర్ సూర్యనారాయణే కారణమని సాహిల్ తల్లిదండ్రులు ఆరోపించారు. వారి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రొఫెసర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణల కింద కేసు నమోదు చేశారు.

మరోవైపు, ఈ ఘటనపై ఐఐటీ బాంబే తొలుత విడుదల చేసిన ప్రకటనపై కూడా విమర్శలు వచ్చాయి. విచారణ పూర్తికాకముందే సాహిల్‌ను దోషిగా పేర్కొన్నట్లు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో సంస్థ తన మొదటి ప్రకటనపై విచారం వ్యక్తం చేస్తూ సోమవారం మరో ప్రకటన విడుదల చేసి క్షమాపణలు తెలిపింది.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని, ప్రొఫెసర్ సూర్యనారాయణను డీన్ బాధ్యతలతో పాటు ప్రొఫెసర్ పదవి నుంచి కూడా తొలగించాలని కోరుతూ విద్యార్థులు క్యాంపస్‌లో నిరసనలు కొనసాగిస్తున్నారు. వారికి మద్దతుగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఆందోళన చేపట్టారు.

అయితే మరోవైపు ప్రొఫెసర్ సూర్యనారాయణకు తోటి అధ్యాపకులు, ఐఐటీ మద్రాస్ ఫ్యాకల్టీ అసోసియేషన్ మద్దతు ప్రకటించాయి. ఆయన నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారని, విద్యార్థుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని ఫ్యాకల్టీ ఫోరమ్ పేర్కొంది.

కాగా, ప్రొఫెసర్ సూర్యనారాయణ దూళ్లు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీ పూర్వ విద్యార్థి. ఆయన 2000లో అక్కడి నుంచి బీటెక్ పూర్తి చేసినట్లు సమాచారం. విద్యార్థి మృతి, ప్రొఫెసర్‌పై వచ్చిన ఆరోపణలు, క్యాంపస్‌లో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.

also read: గూగుల్‌కు భారీ షాక్.. రూ.3,700 కోట్ల జరిమానా విధించిన ఐర్లాండ్ డేటా కమిషన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు