-
దక్షిణాది రాష్ట్రాల్లో ప్రభావం చూపాలని కెసిఆర్ వ్యూహం
-
జగన్మోహన్ రెడ్డి తో పాటు స్టాలిన్ ద్వారా ప్రణాళిక
-
కానీ ఒక్కొక్కరు స్వరాష్ట్రంలో ఓటమి పాలు
-
2తమిళనాడులో డిఎంకె ఓటమితో నీరుగారిన ఆశలు
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: దక్షిణాది రాష్ట్రాల్లో రాజకీయాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ. అయితే ప్రాంతీయ పార్టీల పరంగా చూస్తే టిడిపి అధినేత చంద్రబాబు ఎక్కువ కాలం ముఖ్యమంత్రి తో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కొనసాగారు. జాతీయ రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. అయితే అదే ముద్ర చాటుకోవాలని భావించారు కేసీఆర్. తెలంగాణకు తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన ఆయన జాతీయ రాజకీయాలను శాసించాలని భావించారు. ఈ క్రమంలో చంద్రబాబు ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ తో మంచి సంబంధాలు నెరుపుతూ వచ్చారు. ఏం నిర్ణయం తీసుకోవాలన్నా ముగ్గురు కలిసే తీసుకునేవారు. తమ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేసేవారు. కానీ ఒకరి రాజకీయ ప్రయోజనాన్ని మరొకరు కోరుకునేవారు. అయితే ఈ ముగ్గురు నేతలు ఇప్పుడు అధికారాన్ని కోల్పోయారు.
తొలుత కేసిఆర్ ఓటమి..
2023 ఎన్నికల్లో కేసీఆర్ ఓటమి చవి చూశారు. అంతకుముందు 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించారు కేసీఆర్. తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చిన ఆయన జాతీయ రాజకీయాల్లో ప్రవేశించాలన్న కోరికతో తన పార్టీని భారత రాష్ట్ర సమితిగా మార్చేశారు. దీంతో తెలంగాణ సెంటిమెంట్ అనేది పక్కకు వెళ్లిపోయింది. కెసిఆర్ కు ఓటమి తప్పలేదు. అయితే రాజకీయాల్లో సీనియర్ నేతగా అటు జగన్మోహన్ రెడ్డికి, ఇటు స్టాలిన్ కు దిశా నిర్దేశం చేసేవారు కెసిఆర్. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలతో జాతీయ పార్టీల ను ఒక ఆట ఆడించ వచ్చని అనుకున్నారు. కానీ ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.
తరువాత జగన్ వంతు..
2024 ఎన్నికల్లో ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని కెసిఆర్ జోస్యం చెప్పారు. తాను ఓడిపోయిన ఏపీలో తన మిత్రుడు గెలుస్తాడు అని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో జగన్ గెలిస్తే కనీసం తన స్నేహితుడి ద్వారా ఆయన రాజకీయం చేయవచ్చు అని కెసిఆర్ భావించారు. అయితే ఏపీలో జగన్మోహన్ రెడ్డి పార్టీ దారుణంగా ఓడిపోయింది. కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే ఈ పరిణామం జగన్మోహన్ రెడ్డికి మాత్రమే కాదు.. కెసిఆర్ కు కూడా షాక్. అయితే ఆంధ్ర ప్రజలతో పాటు రాష్ట్రాన్ని విపరీతంగా ద్వేషించే వారు కేసీఆర్. అటువంటి నేతతో జగన్మోహన్ రెడ్డి స్నేహాన్ని ఏపీ ప్రజలు సహించలేదు కూడా. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కేసిఆర్ కూడా ఒక కారణం అన్న విశ్లేషణ ఉంది.
స్టాలిన్ తో సంపూర్ణ ఓటమి
తాజాగా తమిళనాడులో స్టాలిన్ ఓడిపోయారు. 2021లో అధికారంలోకి వచ్చిన స్టాలిన్ బాగానే పాలించారన్న పేరు వచ్చింది. మరోసారి తమిళనాడు ప్రజలు స్టాలిన్ కు అవకాశం ఇస్తారని అంతా భావించారు. ఎగ్జిట్ పోల్స్ తో పాటు సర్వేలు కూడా అదే తేల్చి చెప్పాయి. అయితే అటు కెసిఆర్ తో పాటు జగన్మోహన్ రెడ్డి తమ స్నేహితుడు స్టాలిన్ పై ఆశలు పెట్టుకున్నారు. తాము ఓటమి చవిచూసినా.. తమ స్నేహితుడు నెగ్గుకొస్తాడని భావించారు. కానీ స్టాలిన్ కు ఓటమి ఎదురయింది తమిళనాడులో. దీంతో ఈ ముగ్గురి స్నేహితుల కథ సుఖాంతం అయింది. అయితే ఈ ముగ్గురు రాజకీయంగా స్నేహితులే కానీ.. బయటపడని మిత్రులు. కానీ ఒక్కొక్కరి ఓటమి వారిలో నైరాస్యాన్ని పెంచేసింది.