క్రైమ్ మిర్రర్ : సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో ఓ మహిళ అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. మూడు రోజులుగా కనిపించకుండా పోయిన వెదుళ్ల వెంకట నరసమ్మ హత్యకు గురైనట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆమె అల్లుడు తిరుపతిరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెల్లడైనట్లు సమాచారం. వెదుళ్ల వెంకట నరసమ్మ మూడు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సత్తుపల్లి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో నరసమ్మ అదృశ్యం వెనుక ఆమె అల్లుడు తిరుపతిరావు వ్యవహారశైలిపై పోలీసులకు అనుమానాలు వచ్చినట్లు తెలుస్తోంది.
దీంతో తిరుపతిరావును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. నరసమ్మను హత్య చేసినట్లు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించినట్లు సమాచారం. నరసమ్మకు సంబంధించిన ఆస్తి విషయంలో వివాదం ఉన్న నేపథ్యంలో.. ఆస్తి గొడవే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నరసమ్మ కుటుంబ సభ్యులు మాత్రం మరో కారణాన్ని ఆరోపిస్తున్నారు. తిరుపతిరావుకు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం నరసమ్మకు తెలియడంతో ఆమె తన కుమార్తెతో కలిసి అల్లుడిని మందలించిందని చెబుతున్నారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న తిరుపతిరావు కక్ష పెంచుకుని నరసమ్మను హత్య చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
తిరుపతిరావు ఇచ్చిన సమాచారంతో పోలీసులు, క్లూస్ టీమ్ సిబ్బంది కలిసి నరసమ్మ మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. నారాయణపురం గ్రామ శివారులోని ఓ చెత్త ప్రదేశంలో మృతదేహాన్ని దహనం చేసిన ఆనవాళ్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండటంతో.. అక్కడ లభించిన బూడిదలోని ఎముకలను పోలీసులు సేకరించారు. వాటిని శాస్త్రీయ పరీక్షల కోసం పంపించే ప్రక్రియ చేపట్టినట్లు తెలుస్తోంది. నరసమ్మ హత్యకు అసలు కారణం ఏమిటనేది ప్రస్తుతం కీలకంగా మారింది. ఆస్తి వివాదమే హత్యకు దారితీసిందా? లేక కుటుంబ సభ్యులు చెబుతున్న వివాహేతర సంబంధం వ్యవహారమే కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు విచారణ పూర్తయిన తర్వాత వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటనతో తుంబూరు గ్రామంలో తీవ్ర కలకలం నెలకొంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.
also read : మోహన్‌లాల్ అభిమానులకు నిరాశ.. ఆస్ట్రేలియా వీసా జాప్యంతో లైవ్ షో వాయిదా
