ఢిల్లీలోని ప్రముఖ వైద్య సంస్థ ఎయిమ్స్‌లో చోటుచేసుకున్న ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఒక మహిళా రోగితో సెక్యూరిటీ గార్డు అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు రావడంతో యాజమాన్యం వెంటనే చర్యలు చేపట్టింది.
బాధితురాలి ఫిర్యాదు అందిన వెంటనే ఆసుపత్రి అధికారులు స్పందించి, అంతర్గతంగా విచారణ ప్రారంభించారు. ఈ విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో సంబంధిత సెక్యూరిటీ గార్డును తక్షణమే విధుల నుంచి తొలగించారు.
ఇంతటితో ఆగకుండా, అతడిని నియమించిన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీపై కూడా చర్యలు తీసుకున్నారు. నియమావళి ఉల్లంఘన కారణంగా ఆ సంస్థకు జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎయిమ్స్ యాజమాన్యం, స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కేసు నమోదు చేయించామని తెలిపింది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మహిళల భద్రత విషయంలో ఎయిమ్స్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని అధికారులు స్పష్టం చేశారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి, వారి కుటుంబ సభ్యులకు సురక్షిత వాతావరణం కల్పించడం తమ ముఖ్య బాధ్యత అని పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తామని, బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని ఎయిమ్స్ యాజమాన్యం హామీ ఇచ్చింది.
also read: భార్యపై అనుమానం… సీక్రెట్ కెమెరాతో బట్టబయలు అయిన దొంగతనం – జైపూర్‌లో సంచలనం
