క్రైమ్ మిర్రర్ : హర్యానాలో భారీ దోపిడీ ఘటన కలకలం రేపింది. కురుక్షేత్రలో ఓ సీనియర్ న్యాయవాది ఇంట్లోకి ముసుగులు ధరించిన నలుగురు వ్యక్తులు చొరబడి భారీ మొత్తంలో నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. మొత్తం దోపిడీ విలువ సుమారు రూ.3.15 కోట్లు ఉంటుందని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కురుక్షేత్రకు చెందిన సీనియర్ అడ్వొకేట్ బల్వంత్ సింగ్ వాలియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు థానేసర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధితుడి వివరాల ప్రకారం.. గురువారం రాత్రి ఆయన పెంపుడు కుక్కతో కలిసి బయటకు వెళ్లారు. రాత్రి సుమారు 9.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చిన సమయంలో ఇంట్లోకి దుండగులు చొరబడినట్లు గుర్తించారు. అప్పటికే ఇంట్లో ఉన్న ఆయన భార్యను దుండగులు మంచంపై పడుకోబెట్టి చేతులు, కాళ్లను తాళ్లతో కట్టేశారు. ఆమె ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నోటికి టేప్ కూడా వేశారు. అనంతరం ఇంటికి చేరుకున్న న్యాయవాదిని తుపాకీతో బెదిరించిన దుండగులు ఆయనను కూడా కట్టేశారు. ఇంట్లోని డిజిటల్ లాకర్లను తెరవడానికి ప్రయత్నించిన దుండగులకు అవి తెరవడం సాధ్యం కాకపోవడంతో.. లాకర్లను ఎలా తెరవాలో న్యాయవాదినే అడిగారు. తాము చెప్పిన విధంగా లాకర్లు తెరవకపోతే కాల్చివేస్తామని బెదిరించడంతో భయపడిన న్యాయవాది వారికి సహకరించినట్లు తెలిపారు.
లాకర్లలో ఉన్న సుమారు రూ.17 నుంచి రూ.20 లక్షల నగదు, దాదాపు 1.5 నుంచి 2 కిలోల బంగారు ఆభరణాలు, సుమారు 4 కిలోల వెండి వస్తువులు, పలు విగ్రహాలు, లైసెన్స్ కలిగిన రివాల్వర్, క్యాట్రిడ్జ్‌లను దుండగులు తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దోపిడీ అనంతరం ఇంట్లోని సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసిన దుండగులు.. రికార్డింగ్‌కు సంబంధించిన డీవీఆర్‌లను కూడా తమ వెంట తీసుకెళ్లారు. అంతేకాకుండా మరో రూ.80 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు న్యాయవాది పోలీసులకు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. అంతకుముందు మార్చి నెలలోనూ తమ ఇంట్లో చోరీ జరిగిందని, ఆ సమయంలో సుమారు రూ.50 లక్షలు దోచుకున్నామని దుండగులు చెప్పినట్లు న్యాయవాది వెల్లడించారు.
దొంగలు వెళ్లిపోయిన అనంతరం బాధితులు ఇరుగుపొరుగు వారిని అప్రమత్తం చేయడంతో వారు ఇంటికి చేరుకుని దంపతులను బంధనాల నుంచి విడిపించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను గుర్తించేందుకు పలు కోణాల్లో విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సీసీటీవీ డీవీఆర్‌లు తీసుకెళ్లడంతో వాటి ఆధారాలు లేకపోయినప్పటికీ, ఇతర సాంకేతిక ఆధారాలు, పరిసర ప్రాంతాల్లోని కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.
also read ; వైఎస్ వివేకా జయంతి సందర్భంగా సునీతా రెడ్డి కీలక వ్యాఖ్యలు..
