-ఆ పార్టీకి మేకపాటి ఫ్యామిలీ గుడ్ బై
-త్వరలో తెలుగుదేశం పార్టీలోకి
-నెల్లూరు జిల్లాలో మారుతున్న రాజకీయాలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలనుందా? ఆ పార్టీకి సీనియర్ నాయకుడు ఒకరు గుడ్ బై చెబుతారా? ఫ్యామిలీతో సహా టిడిపిలో చేరుతారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ అంటే.. నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి తన ఫ్యామిలీతో సహా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని జోరుగా ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిస్థితులు, జగన్ వైఖరి నచ్చక ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని… త్వరలో ఆయన పార్టీకి గుడ్ బై చెప్పడం ఖాయమని తెలుస్తోంది.
సుదీర్ఘ నేపథ్యం..
ప్రకాశం తో పాటు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర చూపారు మేకపాటి రాజమోహన్ రెడ్డి. ఒకవైపు రాజకీయాల్లో ఉంటూనే ఆ కుటుంబం వ్యాపార రంగంలో స్థిరపడింది. ఎంపీగా సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు రాజమోహన్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితమైన నేతగా ముద్రపడ్డారు. ఆ అనుబంధం తోనే జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేసారు. ఎంపీ పదవిని వదులుకొని మరి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. అయితే నెల్లూరు జిల్లాలో పెద్దదిక్కుగా ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశారన్న విమర్శ ఉంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఆయన సూచనలను గౌరవించడం లేదు. గౌరవం లేని పార్టీలో ఉండకూడదు అనేది మేకపాటి భావన. అందుకే త్వరలో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎనలేని గౌరవం..
1989 నుంచి ఎంపీ అవుతూ వస్తున్నారు రాజమోహన్ రెడ్డి. నెల్లూరు రాజకీయాల్లో ఆయనకు పెద్దపీట వేస్తూ వచ్చారు రాజశేఖర్ రెడ్డి. అందుకే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేయాలని భావించారు. ఎంపీ పదవిని వదులుకొని వచ్చినందుకు ఆయనకు రాజ్యసభ పదవి కూడా ఇచ్చారు జగన్. ఇంకో వైపు 2019లో గెలిచిన మేకపాటి తనయుడు గౌతమ్ రెడ్డికి పరిశ్రమల శాఖ మంత్రిగా అవకాశం కల్పించారు. కానీ గౌతమ్ రెడ్డి అకాల మరణంతో మేకపాటి రెండో కుమారుడు విక్రమ్ రెడ్డికి శాసనసభ్యుడిగా అవకాశాన్ని ఇచ్చారు. కానీ మంత్రి పదవి ఇవ్వలేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మేకపాటి రాజమోహన్ రెడ్డికి ప్రాధాన్యం లేదు. అంతకుమించి పదవి లేదు. పైగా నెల్లూరు జిల్లాలో అనిల్ కుమార్ యాదవ్, కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వారికి అవకాశాలు ఇచ్చి నిర్లక్ష్యం చేశారన్న ఆవేదన మేకపాటిలో ఉండిపోయింది.
పట్టించుకోని జగన్..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నోరు విప్పారు మేకపాటి. పార్టీలో పరిస్థితులు బాగాలేదని.. కోటరీతో జగన్తో పాటు వైసీపీకి నష్టం జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. తనలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనను పిలిచి మాట్లాడలేదు. దీంతో పార్టీలో కొనసాగడం కంటే బయటకు వెళ్ళిపోవడమే మేలన్న నిర్ణయానికి వచ్చారు. చంద్రబాబు సైతం మేకపాటి విషయంలో సానుకూలంగా ఉండడంతో టిడిపిలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. త్వరలో మేకపాటి టిడిపిలో చేరడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
