Homeతెలంగాణఅనుభవించు రాజా..! కాసేపు కునుకెయ్యరా..!

అనుభవించు రాజా..! కాసేపు కునుకెయ్యరా..!

  • ప్రభుత్వ కార్యాలయంలోనే అధికారుల ‘విశ్రాంతి’పై కలకలం.. ప్రజా సేవకు సెలవా?

మర్రిగూడ (క్రైమ్ మిర్రర్) : ప్రజల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వ కార్యాలయం.. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న అధికారులు.. కానీ విధి నిర్వహణ సమయంలోనే ఛాంబర్లలో నిద్రపోతున్నారనే ఆరోపణలు! ఇదేనా ప్రజా పాలన? ఇదేనా ప్రభుత్వ సేవ? మర్రిగూడ ఎంపీడీఓ కార్యాలయంలో అధికారుల పనితీరుపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతోంది. విధి సమయంలో సీనియర్ అసిస్టెంట్ తన ఛాంబర్‌లో నిద్రిస్తున్నట్లు కనిపించారనే, ఆరోపణలు అధికార యంత్రాంగం తీరుపై ప్రశ్నలు సంధిస్తున్నాయి. ప్రజలు తమ సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే.. అధికారులు మాత్రం విధి నిర్వహణలో ఉన్నారా? లేదా విశ్రాంతిలో ఉన్నారా? అన్న అనుమానాలు కలిగే పరిస్థితి రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ కార్యాలయం అనేది అధికారుల వ్యక్తిగత విశ్రాంతి గది కాదని, ప్రజలకు సేవలందించాల్సిన బాధ్యతాయుతమైన వేదిక అని స్థానికులు గుర్తుచేస్తున్నారు. ఒక మండల స్థాయి అధికారి విధి సమయంలో నిద్రిస్తున్నట్లు ఆరోపణలు రావడం సాధారణ విషయం కాదని, దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు.

ప్రభుత్వ కార్యాలయంలో అధికారుల హాజరు విధి నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవలపై పర్యవేక్షణ ఎంతవరకు ఉందన్న అసలు ప్రశ్న ఇప్పుడు ముందుకొస్తోంది. అధికారుల నిర్లక్ష్యం నిజమని తేలితే అది ఒక్క ఉద్యోగి వ్యవహారంగా చూడకుండా, కార్యాలయ పరిపాలనా వ్యవస్థపై ఉన్నత స్థాయి సమీక్ష అవసరమని ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే మండల స్థాయిలోనే అధికారులు విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తున్నారనే భావన ఏర్పడితే, కిందిస్థాయి సిబ్బందిలో జవాబుదారీతనం ఎలా ఉంటుందన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. ఇదే సమయంలో మర్రిగూడ మండలంలో కొత్తగా వచ్చిన సూపరింటెండెంట్ పనితీరుపై కూడా స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. తరచూ ఫోన్‌లో మాట్లాడటం, కార్యాలయం బయట ఎక్కువ సమయం గడుపుతున్నారనే ఆరోపణలు చర్చకు వస్తున్నాయి. విధి సమయాల్లో సిబ్బంది కార్యాలయంలో ఎంతసేపు ఉంటున్నారు? ప్రజలకు అందుబాటులో ఉన్నారా? కేటాయించిన విధులను సమయానికి పూర్తి చేస్తున్నారా? అనే అంశాలపై ఉన్నతాధికారులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం వేతనం తీసుకోవడం మాత్రమే కాదు.. ప్రజలకు జవాబుదారీగా పనిచేయడం. సామాన్య ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయానికి వచ్చినప్పుడు అధికారులు అందుబాటులో ఉండటం, వారి సమస్యలను వినడం, నిబంధనల ప్రకారం పరిష్కారం చూపడం ప్రభుత్వ యంత్రాంగం ప్రాథమిక బాధ్యత. ఈ బాధ్యతలో ఎక్కడైనా లోపం ఉంటే, దాన్ని గుర్తించి సరిదిద్దాల్సింది ఉన్నతాధికారులే.

  • కలెక్టర్ గారూ.. ఒక్కసారి ‘సడెన్ చెక్’ చేయండి!

మర్రిగూడ ఎంపీడీఓ కార్యాలయంపై వస్తున్న ఆరోపణలకు ఇకనైనా తెరపడాల్సిన అవసరం ఉంది. జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించి, ఆకస్మిక తనిఖీ నిర్వహించాలని, జరిగిన సంఘటనపై విచారణ జరపాలని ప్రజలు కోరుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా కార్యాలయాన్ని తనిఖీ చేస్తే అధికారులు, సిబ్బంది వాస్తవంగా విధులకు హాజరవుతున్నారా? ప్రజలకు అందుబాటులో ఉన్నారా? కార్యాలయ సమయాన్ని సక్రమంగా వినియోగిస్తున్నారా? అన్నది స్పష్టమవుతుందని స్థానికులు అంటున్నారు. సంబంధిత రోజుల్లోని హాజరు రిజిస్టర్లు, బయోమెట్రిక్ వివరాలు, కార్యాలయ రికార్డులు, అవసరమైతే సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించాలని ప్రజలు కోరుతున్నారు. విధి సమయంలో అధికారి నిద్రించినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉంటే నిబంధనల ప్రకారం శాఖాపరమైన చర్యలు తీసుకోవావాలని అంటున్నారు.

“ప్రజల సొమ్ముతో జీతం.. ప్రజల కోసమే విధులు.. మరి విధి సమయంలో నిర్లక్ష్యానికి చోటెక్కడ?” అన్న ప్రశ్న మర్రిగూడలో వినిపిస్తోంది. అధికారులపై ఆరోపణలు వచ్చిన ప్రతిసారీ, వాటిని రాజకీయ లేదా వ్యక్తిగత విమర్శలుగా కొట్టిపారేయడం కాకుండా, వాస్తవాలను పరిశీలించి బాధ్యతను నిర్ధారించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ విధి నిర్వహణలో నిర్లక్ష్యం ఉన్నట్లు తేలితే చర్యలు తప్పవనే స్పష్టమైన సందేశం ప్రభుత్వ యంత్రాంగంలో ఉండాలి. చూడాలి ఈ నిద్రాభంగం పై ఉన్నత అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకోనున్నారో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు