నటి రేణూ దేశాయ్ మరోసారి తన వ్యక్తిగత జీవితం, గుర్తింపు గురించి చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. పవన్ కల్యాణ్‌తో విడిపోయి 14 ఏళ్లు గడిచినా, ఇప్పటికీ తనను ఆయన మాజీ భార్యగానే చూస్తుండటంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నప్పటికీ, గత జీవితానికే పరిమితం చేయడం బాధ కలిగిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా శ్రీరాముడి వనవాసాన్ని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రేణూ దేశాయ్ తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. తెలుగు ప్రేక్షకుల్లో చాలామంది తన ప్రయాణాన్ని 1999లో వచ్చిన ‘బద్రి’ సినిమాతోనే ముడిపెడుతున్నారని చెప్పారు. అంతకుముందు ముంబైలో మోడల్‌గా పనిచేసిన తన జీవితాన్ని, సాధించిన విజయాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “1999 జూన్‌లో ‘బద్రి’ సినిమా కోసం వచ్చినప్పటి నుంచే నా జీవితం మొదలైనట్లు చాలామంది భావిస్తున్నారు. అంతకుముందు నాకు ఒక జీవితం లేదా? విడాకులు తీసుకుని 14 ఏళ్లు పూర్తయ్యాయి. శ్రీరాముడి వనవాసం కూడా 14 ఏళ్లకే ముగిసింది. మరి నా వనవాసం ఎప్పుడు ముగుస్తుంది?” అంటూ తన మనసులోని బాధను బయటపెట్టారు.
విడాకుల తర్వాత కూడా తాను కెరీర్ పరంగా ఎన్నో విజయాలు అందుకున్నానని రేణూ గుర్తుచేశారు. మరాఠీలో విజయవంతమైన చిత్రాన్ని నిర్మించడంతో పాటు, మరో సినిమాకు కథ అందించి దర్శకత్వం వహించారని తెలిపారు. డ్యాన్స్ షోలో పాల్గొనడం, కవిత్వం రాయడం వంటి కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేకమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నానని చెప్పారు. ప్రస్తుతం మళ్లీ నటిగా సినిమాల్లోకి వస్తున్నట్లు పేర్కొన్నారు.
తన పనితీరును, ప్రతిభను గుర్తించకుండా వ్యక్తిగత జీవితంతోనే ముడిపెట్టి మాట్లాడటంపై ఆమె ప్రశ్నించారు. “నేను ఏమీ సాధించకపోతే సినిమాలు, ఇతర కార్యక్రమాల కోసం నన్ను ఎందుకు సంప్రదిస్తారు?” అంటూ తన విజయాలను గుర్తించాలని అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియాలో ఎదురవుతున్న విమర్శలు, ట్రోలింగ్‌పైనా రేణూ దేశాయ్ స్పందించారు. ఒక మూగజీవాన్ని కాపాడినా తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని వాపోయారు. పవన్ కల్యాణ్‌తో సంబంధం లేకుండా తనకంటూ ఒక జీవితం ఉండకూడదన్నట్లుగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, పవన్ కల్యాణ్, రేణూ దేశాయ్ 2012లో విడాకులు తీసుకున్నారు. వీరికి అకీరా నందన్, ఆద్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత పవన్ కల్యాణ్ అన్నా లెజ్నెవాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీ అధ్యక్షుడిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇక రేణూ దేశాయ్ విషయానికి వస్తే.. ‘బద్రి’, ‘జానీ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే అంతకుముందే ముంబైలో మోడల్‌గా గుర్తింపు పొందారు. పలు వాణిజ్య ప్రకటనలతో పాటు ప్రముఖ ‘బ్రీత్లెస్’ మ్యూజిక్ వీడియోలోనూ కనిపించారు. తన వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి, తన ప్రతిభను, పనిని గుర్తించాలని ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
also read: శూర్పణఖ పాత్ర నా జీవితంలో మరిచిపోలేనిది- రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్ పోస్ట్!
