హైదరాబాద్‌లో స్నేహం పేరుతో నమ్మించి భారీ దొంగతనానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న ఓ యువకుడు, విద్యార్థినిని మాయమాటలతో నమ్మించి ఆమె పిన్ని ఇంట్లో భారీగా బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించాడు. ఈ కేసును ఛేదించిన నేరెడ్మెట్ పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి నుంచి బంగారం, నగదుతో పాటు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సమాచారం ప్రకారం.. ఓ కళాశాలలో వార్డెన్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌కు అక్కడే చదువుకుంటున్న విద్యార్థినితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని ఉపయోగించుకున్న అతడు, సదరు విద్యార్థిని పిన్ని కుమారి మానే పద్మావతి ఇంట్లో భారీ మొత్తంలో బంగారు ఆభరణాలు ఉన్నట్లు తెలుసుకున్నాడు. తనకు అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు కొంతకాలం బంగారాన్ని తాకట్టు పెట్టి తిరిగి ఇచ్చేస్తానంటూ విద్యార్థినిని నమ్మించాడు. ఈ విధంగా ఆమె నుంచి ఇంటి తాళాలు తీసుకున్నాడు.
అక్టోబర్ 20న పద్మావతి ఇంటికి తాళం వేసి మార్కెట్‌కు వెళ్లిన సమయంలో నిందితుడు పథకం ప్రకారం చోరీకి పాల్పడ్డాడు. ఇంట్లో ఉన్న 556 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు 2.9 కిలోల వెండి వస్తువులను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నేరెడ్మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బాధితురాలి సోదరి కుమార్తె ద్వారా చంద్రశేఖర్‌పై అనుమానం వ్యక్తమైంది. దీంతో పోలీసులు సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితుడి ఆచూకీ గుర్తించారు. తిరుమలగిరి ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో చంద్రశేఖర్ తన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. దొంగిలించిన బంగారంలో కొంత భాగాన్ని గుంటూరు, చార్మినార్ ప్రాంతాల్లో విక్రయించి రూ.25 లక్షలు సంపాదించినట్లు విచారణలో తెలిపాడు. నిందితుడి నుంచి 429 గ్రాముల బంగారం, రూ.25 లక్షల నగదు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్ వెల్లడించారు. ఈ కేసును వేగంగా ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని డీసీపీ అభినందించారు.
also read: డాక్టర్ దేవీ శెట్టి సేవలకు ఫ్రాన్స్ అరుదైన గౌరవం.. రెండో అత్యున్నత పురస్కారం ప్రదానం!
