Homeక్రైమ్జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మెర్సిడెస్ వర్క్‌షాప్‌లో 8 లగ్జరీ కార్లు దగ్ధం

జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం.. మెర్సిడెస్ వర్క్‌షాప్‌లో 8 లగ్జరీ కార్లు దగ్ధం

రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ మార్కెట్‌లో ఉన్న ఓ మెర్సిడెస్ వర్క్‌షాప్‌లో మంగళవారం రాత్రి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వర్క్‌షాప్‌ మొత్తం వ్యాపించడంతో అక్కడ ఉన్న పలు వాహనాలు, ఖరీదైన విడిభాగాలు, ఇతర ఆటోమొబైల్ యాక్సెసరీస్‌ దగ్ధమయ్యాయి.

మంటల తీవ్రత భారీగా ఉండటంతో దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేశాయి. దాదాపు 5 కిలోమీటర్ల దూరం వరకు పొగలు కనిపించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మొత్తం 10 ఫైరింజన్లను రంగంలోకి దించి సుమారు రెండు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

ప్రమాదం జరిగిన సమయంలో వర్క్‌షాప్‌లో కొత్తవి, పాతవి కలిపి 50కి పైగా కార్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వాటిలో సుమారు 8 లగ్జరీ కార్లు పూర్తిగా కాలిపోయాయి. అయితే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి మిగిలిన వాహనాలను సురక్షితంగా బయటకు తరలించారు. దీంతో మరింత భారీ నష్టం తప్పింది.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వర్క్‌షాప్‌ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తాత్కాలికంగా నిలిపివేశారు.

ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే మంటలు చెలరేగడానికి అసలు కారణం ఏమిటనేది దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమవుతుందని తెలిపారు. అగ్నిప్రమాదంలో కాలిపోయిన కార్లు, విడిభాగాలు, ఇతర సామగ్రికి జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఒకే రోజు మరో అగ్నిప్రమాదం

ఇదిలా ఉండగా.. ఇదే రోజు జైపూర్‌లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం కలకలం రేపింది. నారాయణ్ సింగ్ సర్కిల్ సమీపంలోని ఓ మాల్‌లో మధ్యాహ్నం 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో అక్కడికి చేరుకున్నారు. సుమారు అరగంటలోనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో ఎలాంటి పెను ప్రమాదం జరగలేదు. వరుస అగ్నిప్రమాదాలతో నగరంలో కొంతసేపు ఆందోళన నెలకొంది.

also read: చిన్న సినిమాగా వచ్చి.. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘హనుమాన్ అంశ్’.. టాప్-3లోకి ఎంట్రీ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు