సినిమా హిట్ కావాలంటే భారీ బడ్జెట్, స్టార్ హీరోలు, భారీ ప్రమోషన్లు ఉండాల్సిన అవసరం లేదని మరోసారి నిరూపించింది ‘హనుమాన్ అంశ్’. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ భక్తి ప్రధానమైన చిత్రం.. విడుదలైన సమయంలో పెద్దగా అంచనాలు లేకపోయినా, ప్రేక్షకుల మౌత్ టాక్‌తో అనూహ్యమైన స్థాయిలో వసూళ్లు రాబడుతోంది. తాజాగా 2026లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో టాప్-3లో చోటు దక్కించుకుంది.
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.10 లక్షల వసూళ్లకే పరిమితమైంది. రెండు వారాలు పూర్తయ్యే సమయానికి కూడా సినిమా కలెక్షన్ రూ.1.50 కోట్ల లోపే ఉంది. అయితే ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్‌తో సినిమాకు క్రమంగా ఆదరణ పెరిగింది. థియేటర్లలో ఆక్యుపెన్సీ పెరగడంతో కలెక్షన్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ‘హనుమాన్ అంశ్’ రూ.366.45 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దీంతో ‘టాక్సిక్’, రామ్‌చరణ్ నటించిన ‘పెద్ది’, విజయ్ ‘జన నాయగన్’ వంటి భారీ చిత్రాలను ఈ సినిమా వెనక్కి నెట్టింది. 2026 వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్‌లో ‘ధురంధర్ 2’, ‘బోర్డర్ 2’ తర్వాత ‘హనుమాన్ అంశ్’ మూడో స్థానంలో ఉన్నట్లు ట్రేడ్ రిపోర్టులు పేర్కొంటున్నాయి.
‘పెద్ది’ తన థియేట్రికల్ రన్‌లో రూ.341.90 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించగా.. ‘టాక్సిక్’ రూ.341.99 కోట్లతో రన్ ముగించింది. మరోవైపు ‘జన నాయగన్’ సుమారు రూ.325 కోట్ల వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. ఈ సినిమాల కలెక్షన్లను దాటేసి ‘హనుమాన్ అంశ్’ రూ.366 కోట్లకు పైగా గ్రాస్‌తో ముందుకు సాగుతోంది.
‘హనుమాన్ అంశ్’ కలెక్షన్లలో అసలు జోరు మూడో వారం తర్వాత కనిపించింది. మూడో వారంలో రూ.10.40 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం.. నాలుగో వారంలో ఏకంగా రూ.61 కోట్లను రాబట్టింది. ఐదో వారంలో వసూళ్లు మరింత పెరిగి రూ.90.25 కోట్లకు చేరాయి. ఆరో వారంలో కూడా రూ.80.25 కోట్ల వసూళ్లతో సత్తా చాటింది. ఏడో వారాంతంలోనూ రూ.28.50 కోట్ల నెట్ కలెక్షన్ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూ.366 కోట్లకు పైగా..
సుమారు రూ.2 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు దేశీయ మార్కెట్‌లో రూ.280.93 కోట్ల నెట్, రూ.325.80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు సమాచారం. ఓవర్సీస్ మార్కెట్ నుంచి మరో రూ.26.50 కోట్ల గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన స్టార్ హీరోల చిత్రాలు పోటీగా ఉన్న సమయంలో.. ఒక చిన్న భక్తి చిత్రం ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం సినీ, ట్రేడ్ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది.
‘బోర్డర్ 2’ రికార్డుపై కన్ను?
ఇక దేశీయ బాక్సాఫీస్‌లోనూ ‘హనుమాన్ అంశ్’ మరో కీలక మైలురాయికి చేరువలో ఉంది. ‘బోర్డర్ 2’ ఇండియాలో రూ.329.43 కోట్ల నెట్ వసూళ్లతో తన థియేట్రికల్ రన్‌ను ముగించింది. ప్రస్తుతం ‘హనుమాన్ అంశ్’ ఇండియా నెట్ కలెక్షన్ రూ.275.88 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. దీంతో ‘బోర్డర్ 2’ను అధిగమించాలంటే ఈ సినిమాకు మరో రూ.53.55 కోట్ల నెట్ వసూళ్లు అవసరం. రాబోయే రోజుల్లో ఈ లక్ష్యాన్ని అందుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
also read: ‘ది ప్యారడైజ్’ కోసం టాలీవుడ్‌లోకి రాఘవ్ జుయల్.. సినిమా సంస్కృతిపై ఎమోషనల్ కామెంట్స్
