కర్నూలు ఆదోనిలో సెప్టెంబర్ 18న చోటుచేసుకున్న వీరేశ్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మృతుడి భార్య శైలజతో పాటు ఆమె బావ గిడ్డయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. భర్త వేధింపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న శైలజ, తన బావ గిడ్డయ్యతో కలిసి వీరేశ్‌ను హత్య చేయాలని పథకం వేసినట్లు వెల్లడైంది. ముందుగా వీరేశ్‌ను పొలాల వైపు తీసుకెళ్లిన నిందితులు అక్కడ అతడిపై దాడికి పాల్పడ్డారు.
వీరేశ్ గొంతు బిగించి, అనంతరం ఛాతీపై కత్తితో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. హత్య వెనుక ఉన్న కారణాలను, నిందితుల పాత్రను గుర్తించారు.
కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శైలజను, హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్న గిడ్డయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. కేసుకు సంబంధించి మరిన్ని వివరాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. సీట్ల కింద దాచిన 6.5 కిలోలు
