ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం అక్రమ రవాణా చేస్తున్న ముఠా గుట్టురట్టైంది. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో సుమారు 6.5 కిలోల బంగారాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ దాదాపు రూ.9 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.
ఈ వ్యవహారంలో ఓ మహిళతో పాటు మొత్తం ఎనిమిది మందిని అనుమానితులుగా అరెస్ట్ చేశారు. ఎగ్జిబిషన్ వ్యాపారం పేరుతో దుబాయ్ వెళ్లిన నిందితులు.. అక్కడ బంగారాన్ని చైన్ల రూపంలోకి మార్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అనంతరం వాటిని విమానంలోని సీట్ల కింద దాచి భారత్‌కు తరలించినట్లు అధికారులు గుర్తించారు.
దుబాయ్ నుంచి విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత అనుమానంతో తనిఖీలు చేపట్టగా అక్రమంగా తరలిస్తున్న బంగారం బయటపడింది. దీంతో అధికారులు ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో బంగారం రవాణాకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
అరెస్టయిన నిందితులను కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం వారికి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈ బంగారం స్మగ్లింగ్ వెనుక మరెవరైనా ఉన్నారా? ఈ ముఠా గతంలోనూ ఇదే విధంగా బంగారాన్ని తరలించిందా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: “జైలులో వేధింపులు భరించలేకపోతున్నా.. బెయిల్ ఇవ్వండి లేకపోతే చనిపోనివ్వండి”: పవిత్రా గౌడ
