-ఫలించని ఆకర్ష్
-పార్టీలో చేరేందుకు నేతల విముఖత
-దక్కని టిక్కెట్ల హామీ
-చేరిన వారికి గౌరవం అంతంత మాత్రం
-అందుకే ఈసారి నేరుగా హై కమాండ్ రంగంలోకి..
-మున్ముందు పార్టీలో భారీగా చేరికలు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
తెలంగాణలో బిజెపి ఆకర్ష్ ఫెయిల్ అయ్యిందా? బిజెపిలో చేరేందుకు నేతలు ఎందుకు ఆసక్తి చూపడం లేదు? రెండేళ్ల వ్యవధి మాత్రమే ఎన్నికలకు ఉండగా నాయకులు ఎందుకు ముందుకు రావడం లేదు? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో దీనిపైన ఆసక్తికర చర్చ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి బలం పుంజుకుంది. ఓటు శాతం పెంచుకుంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీతో సమానంగా 8 ఎంపీ సీట్లను దక్కించుకుంది. దీంతో తెలంగాణలో బిజెపి బలమైన శక్తిగా ఎదుగుతుందని అంతా భావించారు. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని అంచనా వేశారు. కానీ సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండేళ్లు గడుస్తున్న.. పేరు మోసిన నేతలు బిజెపి వైపు చూడకపోవడం ఆ పార్టీకి చాలా లోటు.
చాలామంది ఆసక్తి..
వాస్తవానికి చాలామంది నాయకులు బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపారు. కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం.. తెలంగాణలో ఏకంగా 8 ఎంపీ సీట్లను దక్కించుకోవడం చూసి చాలామంది నాయకులు బిజెపిలో చేరేందుకు ఆసక్తి చూపారు. కానీ వారిని పార్టీలోకి తీసుకెళ్లడంలో నాయకత్వం విఫలమైంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ పై స్పష్టత ఇవ్వలేకపోవడం ప్రధాన లోటు. పార్టీలోకి వస్తే హోదా, గౌరవం పై కూడా సరైన హామీ ఇవ్వకపోవడంతో చాలామంది నేతలు అడుగులు వేశారు వెనక్కి. ఆపై బిజెపిలో కొత్త, పాత అనే విభజన రేఖ ఉంటుంది అనేది బలమైన ప్రచారం. దానికి భయపడి కూడా చాలామంది నేతలు బిజెపిలో చేరకుండా ఉన్నారు. పార్టీలో కొందరికే ప్రాధాన్యం ఉంటుందని.. కొత్తగా చేరేవారికి కనీస స్థాయిలో కూడా గౌరవం ఉండదన్న అభిప్రాయం బలంగా బయటకు వచ్చింది. అందుకే కమలం వైపు నేతలు కనీసం చూడలేదని తెలుస్తోంది.
వారంతా యూ టర్న్..
చాలామంది సీనియర్ నేతలు బిజెపిలో చేరారు గతంలో. కాంగ్రెస్ పార్టీతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితిలో పనిచేసిన నాయకులు సైతం బిజెపిలో చేరారు. కానీ అక్కడ ఇమడలేక బయటకు వచ్చేసారు. పెద్దపల్లి వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, దాసోజు శ్రవణ్ లాంటి పెద్ద పెద్ద నేతలు ఉండలేకపోయారు బిజెపిలో. దానికి కారణం పార్టీలో సరైన గౌరవం దక్కకపోవడమే. ఈటెల రాజేందర్ లాంటి రాష్ట్ర నాయకుడు బిజెపిలో చేరిన తర్వాత నామమాత్రం అయ్యారు. ఆయనకంటే మేమే సీనియర్లను అని.. పార్టీ పాత నేతలం అంటూ చాలామంది నేతలు ఆయనతో విభేదం పెట్టుకున్నారు. పార్టీలో చేరిన వారి విషయంలో కనీస మర్యాద దక్కకపోవడంతో చాలామంది యూటర్న్ అయ్యారు. ఆ పరిస్థితిని చూసి కొత్తగా చేరాలనుకునే వారు సైతం వెనుకడుగు వేశారు.
గ్రామీణ ప్రాంతాల్లో చాలా కష్టం..
ప్రస్తుతం పట్టణాలతో పాటు నగరాల్లోనే బిజెపి పరిస్థితి బాగుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పెద్దగా బాగాలేదు. ముఖ్యంగా ద్వితీయ శ్రేణి నాయకత్వం లేదు. అయితే ప్రారంభంలో ఆపరేషన్ ఆకర్ష పేరుతో ఇతర పార్టీల నేతలను చేర్చుకోవాలని భారీ ప్రణాళిక వేశారు. కానీ క్షేత్రస్థాయిలో పార్టీలో అనుకూల పరిస్థితి లేదు. అందుకే పార్టీలో చేరికలు పెరగలేదు. ఉన్నది తక్కువ సమయం మాత్రమే. ఈ సమయంలో మళ్లీ వలసలు ప్రారంభం కావాలని.. పార్టీలో చేరికలు పెరగాలని బిజెపి అగ్ర నేతలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మరి కొద్ది రోజుల్లో బిజెపిలో భారీగా నేతలు చేరిక ఉంటుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.
