-1000 కార్లతో భారీ కాన్వాయ్ ఆలోచన వెనుక కారణం అదే
-తెలంగాణ సమాజం, మీడియా అటెన్షన్ తనవైపు తిప్పుకునేందుకే
-అచ్చం కెసిఆర్ ఆలోచనలే..
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో:-
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ స్టైల్ వేరు. ఆయన సెంటిమెంటును బలంగా రగిలించగలిగారు. ఆపై ప్రజాకర్షక శైలితో ముందుకు వెళ్లేవారు. కెసిఆర్ ఎప్పుడు ఏ ఉద్యమం చేసినా.. ఏ రాజకీయ కార్యక్రమం చేపట్టినా దానికి భారీ తనం జోడించడం ఆయన ప్రత్యేకత. అలానే సక్సెస్ అయ్యారు తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్. రాజకీయంగాను సైతం బలమైన ముద్ర చాటుకున్నారు. అయితే ఇప్పుడు తండ్రి కెసిఆర్ మాదిరిగానే ముందుకు వెళ్తున్నారు కల్వకుంట్ల కవిత. దాదాపు 1000 కార్లతో ర్యాలీ, మహారాష్ట్రకు కార్ల కాన్వాయ్ తో దండయాత్ర వంటివి కెసిఆర్ ఆలోచనలకు దగ్గరగా ఉండేవే. గతంలో కెసిఆర్ ఇమేజ్ ను, భారత రాష్ట్ర సమితి పరిధిని విస్తరించడంలో కెసిఆర్ ఇటువంటి ఆలోచనలు, ఆచరణలో పెట్టి సఫలం చేశారు. ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ రక్షణ సేన ఇమేజ్ కోసం భారీ కార్ల ప్రదర్శనకు దిగారు కవిత. బీసీ బిల్లు సాధన కోసం 1000 కార్లతో ఢిల్లీకి చలో ర్యాలీ నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించారు. ఇది పక్కాగా కేసీఆర్ మార్క్ మాస్ పొలిటికల్ వ్యూహం.
బీసీల జనాభా అధికం..
తెలంగాణలో బీసీలను తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా కవిత పావులు కదుపుతున్నారు. తెలంగాణ సమాజంలో బీసీల జనాభా సగానికి పైగా ఉంటుంది. అందుకే వారిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు కవిత. తన కొత్త పార్టీకి బలమైన ఓటు బ్యాంకును నిర్మించుకోవాలన్నది ఆమె ఆలోచన. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును కేంద్ర ప్రభుత్వం.. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో గా ఆమోదించాలని డిమాండ్ చేస్తూ ఆమె ఈ శంఖారావాన్ని పూరించారు. సామాజిక న్యాయ సంకల్ప సభగా నామకరణం చేశారు. కేవలం విజ్ఞప్తులకు మాత్రమే పరిమితం కాకుండా.. ఢిల్లీ పీఠాన్ని కదిలించేలా వేయి కార్ల కాన్వాయ్ తో ఆందోళన అని ప్రకటించడం ద్వారా.. బీసీ సామాజిక వర్గాల్లో ఒక రకమైన రాజకీయ చైతన్యాన్ని, తన పట్ల ఆకర్షణను తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ఆకట్టుకోవడమే అసలు లక్ష్యం..
తెలంగాణ రాజకీయాల్లో బీసీ ఓటు బ్యాంకు ఏ రాజకీయ పార్టీకి కూడా స్థిరంగా లేదు. మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో అయితే బీసీలు అడ్డగోలుగా చీలిపోయారు. అన్ని పార్టీల్లో కూడా ప్రముఖ బీసీ నాయకులు ఉన్నారు. బీసీలను ఒకే వేదిక పైకి తెచ్చి.. వారి ఏకైక ప్రతినిధిగా, ప్రధాన ఛాంపియన్గా రూపాంతరం చెందడం కవితకు అతిపెద్ద సవాల్. గతంలో మారోజు వీరన్న వంటి ఉద్యమకారుల ఆశయాలను గుర్తు చేస్తూ ఆమె బీసీల కోసం పనిచేస్తానని ప్రకటించారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఆ విశ్వసనీయత ప్రదర్శించలేకపోయారు. కవిత అనుసరిస్తున్న కేసీఆర్ మార్కు భారీ వ్యూహం మీడియా దృష్టిని, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు అనేది ఇట్టే అర్థం అవుతుంది. అయితే అది ఓట్ల రూపంలో ఎంతవరకు మారుతుంది అనేది చూడాలి.
