-
హైదరాబాద్ నుండి తిరుపతి వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు
-
విజయవాడ – చెన్నై జాతీయ రహదారి పై ఘటన
-
బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు
-
తప్పిన ఘోర ప్రమాదం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: ఈ మధ్య వరుస బస్సు ప్రమాదాలు ప్రయాణికుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ ప్రమాదాలకు అధికారుల నిర్లక్షమే ప్రధాన కారణం, బస్సు ల కండిషన్, ఫిట్నెస్, సరిగా ఉన్నాయా? లేవ? బస్సు ప్రయాణానికి అనుకూలంగా వుందా? లేదా? అని పర్యవేక్షించే బాధ్యత ఎవరి పై ఉంటుంది అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
వరుస బస్సు ప్రమాదాలు మరవక ముందే శుక్రవారం ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరం అడ్డరోడ్డు (రాజుపాలెం) సమీపంలో విజయవాడ – చెన్నై జాతీయ రహదారి పై ఈ తెల్లవారుజామున (మే 15, 2026) కావేరి ట్రావెల్స్ బస్సు వెనుక టైరులో బేరింగ్ పట్టేయడంతో మొదట పొగలు వచ్చాయి.
ఆపై కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్సు మొత్తం వేగంగా వ్యాపించాయి. బస్సు వెనుక నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ సుభాష్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేశారు.
బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు తమ లగేజీతో సహా హుటాహుటిన కిందకు దిగిపోవడంతో అందరూ ప్రాణాలతో బయటపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినప్పటికీ అప్పటికే బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. కావేరి ట్రావెల్స్ యాజమాన్యం ప్రయాణికులకు వేరే ప్రత్యామ్నాయ బస్సును ఏర్పాటు చేసి తిరుపతికి పంపించింది.