-
సముద్రంలో విమానాశ్రయం…!
-
45 కోట్లతో కోరే బీచ్ లో ఏర్పాటు..!
Crime Mirror,Latest Updates: దేశంలోనే తొలి సముద్ర విమానాశ్రయం (ఆఫ్సోర్ ఎయిర్పోర్ట్) నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఆ దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలోని పాల్ఘాట్ జిల్లా కోరే బీచ్ దేనికి వేదిక కాబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డిపిఆర్) సమర్పించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తాజాగా అధికారులను ఆదేశించడంతో ఈ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తోంది.
సముద్రంలో విమానాశ్రయం అంటే సముద్రంలో ఉండే విమానాశ్రయమే. లోతు తక్కువ ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేసి దానిని మట్టితో పూడ్చి దానిపైన ఎయిర్పోర్టును నిర్మిస్తారని అధికారులు చెబుతున్నారు. పరిమిత భూభాగం ఉన్న బాలిజ కేంద్రాల్లో పెరుగుతున్న రాకపోకలను, అవసరాలను తీర్చడానికి ఈ తరహా విమానాశ్రయాలను నిర్మిస్తుంటారు.
ఇప్పటికే అనేక దేశాల్లో ఇటువంటి విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఇప్పటికే ఈ తరహా సముద్రంలోని విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.
మూడు వైపులా సముద్రం ఉండే ముంబై మహానగరంలోనూ భూభాగం చాలా పరిమితంగా ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సముద్రంలో విమానాశ్రయాన్ని నిర్మించడం ద్వారా రాకపోకల ప్రక్రియను సులభంగా చేసుకోవడంతోపాటు భూ సమస్యను అధిగమించేందుకు అవకాశం ఉంటుందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది.
ఈ నేపథ్యంలోనే దేశంలో తొలి సముద్ర విమానాశ్రయాన్ని ముంబైకి ఉత్తరాన 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న కోరే బీచ్ లో నిర్మించేందుకు అక్కడ ప్రభుత్వం సిద్ధమవుతోంది. సుమారు రూ.45 వేలకోట్ల రూపాయల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది.
ఈ విమానాశ్రయం నిర్మాణంలో భాగంగా సముద్రాన్ని పూడ్చి కొంత భూభాగాన్ని నిర్మించడానికి 25వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే మిగిలిన 20 వేల కోట్లతో ఎయిర్పోర్ట్ మౌలిక సదుపాయాలు, టెర్మినల్, రన్వేలు మొదలైనవి నిర్మించనున్నారు.
-
తొమ్మిది వేల మంది ప్రయాణికుల రాకపోకలకు అనుగుణంగా..
ఈ విమానాశ్రయాన్ని 9000 మంది ప్రయాణికుల రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. దీన్ని ఒక ప్రధానమైన ఎయిర్ కార్గో హబ్ గా రూపొందించాలన్నది ఈ ప్రభుత్వ ఆలోచన. ఏటా 30 లక్షల మెట్రిక్ టన్నుల సరుకు రవాణాను నిర్వహించగల సదుపాయాలు కల్పించాలన్న ప్రణాళికను ఉన్నాయి.
ఈ మేరకు పాల్గాట్ జిల్లాలోనే 29.8 కోట్ల మెట్రిక్ టన్నుల వార్షిక కార్గో సామర్ధ్యంతో నిర్మించాలని భావిస్తున్న వధావన్ పోర్టుతో ఈ విమానాశ్రయం అనుసంధానం కానుంది. ఈ విమానాశ్రయం పూర్తయితే దేశంలోనే తొలి సముద్ర విమానాశ్రయ నిర్మాణం పూర్తయినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే మహారాష్ట్ర రూపురేఖలు మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఈ తరహా విమానాశ్రయం దేశంలోనే మొదటిది కావడంతో ముంబై అభివృద్ధి మరో స్థాయికి వెళుతుందని ఆర్థిక రంగాన్ని పనులు పేర్కొంటున్నారు. అయితే ఈ విమానాశ్రయాన్ని ఎప్పటిలోగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది.