HomeUncategorizedపల్నాడులో విషాదం.. అబార్షన్ కిట్ వాడిన 17 ఏళ్ల మైనర్ బాలిక మృతి

పల్నాడులో విషాదం.. అబార్షన్ కిట్ వాడిన 17 ఏళ్ల మైనర్ బాలిక మృతి

జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రం నుంచి వలస వచ్చి స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తున్న 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం పల్నాడు జిల్లాలో కలకలం రేపింది. యడ్లపాడు మండలం బోయపాలెం పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు మెడికో-లీగల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ సీహెచ్ రత్న మన్మోహన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన మైనర్ బాలిక బోయపాలెంలోని ఓ స్పిన్నింగ్ మిల్లులో పనిచేస్తోంది. అదే ప్రాంతంలో పనిచేస్తున్న ఓ వ్యక్తితో ఆమె సహజీవనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది.

గర్భం విషయం బయటకు వస్తే సమస్యలు ఎదురవుతాయనే భయంతో ఆమెతో ఉన్న వ్యక్తి అర్హత లేని ఆర్ఎంపీని సంప్రదించినట్లు సమాచారం. ఆ వ్యక్తి సూచనల మేరకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే అబార్షన్ కోసం ఉపయోగించే MTP కిట్‌ను కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

బాలిక మూడు రోజుల పాటు మాత్రలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మూడో రోజు రాత్రి ఆమెకు తీవ్రమైన కడుపునొప్పితో పాటు అధిక రక్తస్రావం ప్రారంభమైంది. పరిస్థితి విషమించడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

మెడికల్ షాపుపై విచారణకు డిమాండ్

అబార్షన్ కిట్ బోయపాలెం పరిధిలోని ఓ మెడికల్ షాపు నుంచి కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే తమ దుకాణాల నుంచి ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించలేదని స్థానిక మెడికల్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు.

బాలికతో కలిసి మందులు కొనుగోలు చేసిన వ్యక్తిని పూర్తిస్థాయిలో విచారిస్తే కిట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి సూచనలతో కొనుగోలు చేశారు? అనే అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అర్హత లేని వ్యక్తులు వైద్య సేవల పేరుతో ఇలాంటి మందులు సూచించడంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం నివేదిక, దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

వలస కార్మికుల భద్రతపై ప్రశ్నలు

ఈ ఘటనతో చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని స్పిన్నింగ్ మిల్లుల్లో పనిచేస్తున్న వలస కార్మికుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. బీహార్, అస్సాం, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కుటుంబాలు ఇక్కడ ఉపాధి కోసం వస్తున్నాయి.

ముఖ్యంగా మైనర్ బాలికల రక్షణ, వారి భద్రత, కార్మిక చట్టాల అమలు, లైంగిక వేధింపుల నిరోధక చర్యలపై సంబంధిత శాఖలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ ఇలాంటి ఘటనలపై ఆరోపణలు వచ్చినప్పటికీ, వాటిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.

మైనర్ బాలిక మృతికి దారితీసిన పరిస్థితులపై పూర్తి నిజాలు పోలీసుల దర్యాప్తు, వైద్య నివేదికలు వెలువడిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

also read: యంగ్ ఫిల్మ్‌మేకర్లకు గుడ్‌న్యూస్.. ‘యంగ్ ఫిల్మ్‌మేకర్ ఛాలెంజ్-2026’కు దరఖాస్తుల ఆహ్వానం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు