Homeక్రైమ్స్టాక్ మార్కెట్ లాభాల పేరుతో సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.69.75 లక్షల టోకరా

స్టాక్ మార్కెట్ లాభాల పేరుతో సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.69.75 లక్షల టోకరా

స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు వస్తాయని ఆశ చూపించి సైబర్ నేరగాళ్లు ఓ రిటైర్డ్ ఉద్యోగిని బురిడీ కొట్టించారు. వివిధ దశల్లో పెట్టుబడి పెట్టిస్తూ చివరకు ఏకంగా రూ.69.75 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

పెనమలూరు మండలానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి వాట్సాప్‌లో స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించిన ఓ ప్రకటన వచ్చింది. దానిని నమ్మిన ఆయన సైబర్ నేరగాళ్లు సూచించిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. అనంతరం ఆయన్ను ఓ నకిలీ ట్రేడింగ్ గ్రూపులోకి చేర్చారు.

మొదట చిన్న మొత్తంతో పెట్టుబడి పెట్టేలా నేరగాళ్లు నమ్మకం కలిగించారు. రూ.50 వేల పెట్టుబడికి రూ.2,500 లాభం వచ్చినట్లు యాప్‌లో చూపించారు. అంతేకాకుండా కొంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించడంతో బాధితుడికి అనుమానం రాలేదు.

దీంతో మరింత ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని సైబర్ మోసగాళ్లు నమ్మించారు. వారి మాటలు విశ్వసించిన బాధితుడు మొత్తం 13 లావాదేవీల్లో ఏడు వేర్వేరు బ్యాంకు ఖాతాలకు రూ.69.75 లక్షలు బదిలీ చేశారు.

అయితే డబ్బు వెనక్కి తీసుకునే సమయంలో అసలు మోసం బయటపడింది. నగదు విత్‌డ్రా చేసుకోవాలంటే జీఎస్టీ, ఆదాయపు పన్ను, కమీషన్ తదితర పేర్లతో మరింత డబ్బు చెల్లించాలని నిందితులు డిమాండ్ చేశారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించారు.

వెంటనే పోలీసులను సంప్రదించి జరిగిన విషయాన్ని వివరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నగదు ఏ ఖాతాలకు బదిలీ అయిందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో వచ్చే ప్రకటనలు, గుర్తుతెలియని యాప్‌లు, వాట్సాప్ గ్రూపుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

also read: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక పరిణామం.. నిందితుడికి పోలీస్ కస్టడీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు