మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గొండియా–బాలాఘాట్ జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
గొండియా సమీపంలోని నాగ్రా వద్ద ఈ ఘటన జరిగింది. వేగంగా వచ్చిన ట్రక్కు, బొలెరో వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఢీకొన్న వేగానికి బొలెరో వాహనం పూర్తిగా ధ్వంసమైంది. వాహనంలో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఏడుగురిని బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మృతులు, క్షతగాత్రుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం మృతులంతా మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ జిల్లాకు చెందినవారిగా పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
also read: ఏపీ డీఎస్సీ స్పోర్ట్స్ కోటా అవకతవకలపై శాప్ ఎండీ క్లారిటీ
