క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన అసెంబ్లీ వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్ (తాతా మధు), నవీన్ కుమార్ రెడ్డిలను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.కాగా సోమవారం అసెంబ్లీ వద్ద బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన నిరసన సందర్భంగా పోలీసులతో వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారం అసెంబ్లీ సమావేశాల్లోనూ తీవ్ర దుమారం రేపింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఈ అంశంపై సభలో భావోద్వేగానికి గురయ్యారు.
Also Read:బిగ్‌బాస్ రియాలిటీ షో: భారీ పారితోషికాలతో హోస్ట్‌ల హవా.. టాప్ ప్లేస్‌లో సల్మాన్ ఖాన్!
ఈ ఘటనపై అసెంబ్లీ స్పీకర్ ఓఎస్డీ పొల్లేపల్లి వెంకటేశం ఫిర్యాదు చేయడంతో సైఫాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 352, 3(5)తో పాటు SC/ST (అత్యాచారాల నిరోధక) చట్టంలోని 3(1)(r), 3(2)(va), 3(2)(vii) సెక్షన్లను నమోదు చేసినట్లు వెల్లడించారు.మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్సీ క్వార్టర్స్‌లో ఉన్న తాతా మధు నివాసానికి పోలీసులు చేరుకుని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న బీఆర్‌ఎస్ నేతలు పోలీసుల చర్యను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అనంతరం తాతా మధును పోలీసులు నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం.
Also Read:బాలయ్య ‘దాదా’లో మంచు మనోజ్.. విలన్‌గా మరోసారి మాస్ ట్రీట్!
తాతా మధుతో పాటు నవీన్ కుమార్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల చర్యకు నిరసనగా బీఆర్‌ఎస్ నేతలు నారాయణగూడ పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. అరెస్టులను పార్టీ తీవ్రంగా ఖండించింది.అయితే తనపై వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు. తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని, అసెంబ్లీ గేటు వద్ద పోలీసుల వ్యవహారంపై ఆగ్రహంతో మాట్లాడానని స్పష్టం చేశారు. తన మాటలను స్పీకర్‌ను ఉద్దేశించినవిగా భావిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నానని, విచారం వ్యక్తం చేస్తున్నానని కూడా తెలిపారు.
Also Read: అనుష్క శెట్టి కెరీర్‌పై ఆసక్తికర చర్చ.. ఆ సినిమా రిజల్ట్‌పైనే భవిష్యత్ నిర్ణయమా?
మరోవైపు, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కూడా “అక్రమ కేసులకు భయపడేది లేదు” అంటూ స్పందించారు. బీఆర్‌ఎస్ నేతలు ఈ అరెస్టులను రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా ఆరోపించగా, కాంగ్రెస్ నేతలు మాత్రం స్పీకర్ గౌరవానికి భంగం కలిగించే వ్యాఖ్యలను సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వ్యవహారం బీఆర్‌ఎస్–కాంగ్రెస్ మధ్య రాజకీయ వివాదాన్ని మరింత తీవ్రం చేసింది. అరెస్టైన ఇద్దరు ఎమ్మెల్సీలను పోలీసులు న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు తాజా సమాచారం. కేసు దర్యాప్తును సైఫాబాద్ పోలీసులు కొనసాగిస్తున్నారు.
