-
స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో..
-
కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు
-
ప్రచార అస్త్రంగా మార్చుకోనున్న కాంగ్రెస్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. విపక్ష భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ కుమార్ రెడ్డి అరెస్టు అయ్యారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం నేపథ్యంలో.. అసెంబ్లీ ప్రాంగణంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై ఆ ఇద్దరు ఎమ్మెల్సీలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీ స్పీకర్ ఓఎస్డి ఇచ్చిన ఫిర్యాదుతో వారిపై కేసు నమోదయింది.
-
స్పీకర్ కన్నీరు..
స్పీకర్ను ఉద్దేశించి ఏక వచనంతో సంబోధించడం, కఠిన పదజాలాన్ని ప్రయోగించడమే ఆయన అరెస్టుకు దారితీసింది. ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ ప్రసాద్ కన్నీరు సైతం పెట్టుకున్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
అమర్యాదగా మాట్లాడడాన్ని తప్పుపట్టారు. శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మంత్రులు డిమాండ్ చేశారు. స్పీకర్ వంటి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తిపై ఓ ఎమ్మెల్సీ కఠిన పదజాలంతో మాట్లాడడం.. చట్టసభలకు గౌరవం కాదని స్వయంగా రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ.. ఆయనను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడుపై ఉందన్నారు. వారిపై వివక్షపూరకంగా మాట్లాడడం, అవమానించడం సరైన కాదు అని అన్నారు.
-
ప్రస్తుతం ఇద్దరి అరెస్ట్..
ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్సీలు అరెస్ట్ అయ్యారు. వారిపై కఠిన సెక్షన్లు నమోదు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ తో పాటు బి.ఎన్.ఎస్ లోని ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. అసెంబ్లీ వద్ద ఆందోళనకు దిగిన భారత రాష్ట్ర సమితి సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, సుధీర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ల పైన కూడా కేసులు నమోదు చేశారు.
సిసి ఫుటేజ్ ఆధారంగా సైఫాబాద్ పోలీస్ స్టేషన్ లో వారిపై ఈ కేసులు నమోదయ్యాయి. ప్రతిపక్షం సభా బహిష్కరణలు, గేట్ల వద్ద ధర్నాల వ్యూహాన్ని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి తాతా మధు చేసిన వ్యాఖ్యలు బలమైన రాజకీయ అస్త్రంగా మారాయి. చట్టసభలను, స్పీకర్ పీఠాన్ని భారత రాష్ట్ర సమితి నేతలు ఏ స్థాయిలో అవమానిస్తున్నారు ప్రజలకు వివరించేందుకు కాంగ్రెస్ గట్టిగానే ప్రణాళిక రచించింది. ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు నిర్ణయించింది.
