HomeUncategorizedనేపాల్‌ వరదల్లో ఎల్బీనగర్ యువతి గల్లంతు..

నేపాల్‌ వరదల్లో ఎల్బీనగర్ యువతి గల్లంతు..

క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని నేపాల్‌ వరదల్లో గల్లంతైనట్లు సమాచారం. ఎల్బీనగర్‌ వాస్తు కాలనీకి చెందిన సుహాసిని రెడ్డి మానస సరోవరం యాత్రకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామానికి చెందిన కందిమల్ల మహేందర్‌రెడ్డి కుటుంబం ప్రస్తుతం ఎల్బీనగర్‌ వాస్తు కాలనీలో నివాసం ఉంటోంది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె సుహాసిని రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించి సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడ్డారు.

సుహాసిని రెడ్డికి 2004లో నల్గొండ జిల్లా మునుగోడు మండలం గూడపూర్‌కు చెందిన సంజీవరెడ్డితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సుహాసిని, సంజీవరెడ్డి ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. తొలుత న్యూజిలాండ్‌లో స్థిరపడిన ఈ దంపతులు.. ఉద్యోగరీత్యా ఆ తర్వాత ఆస్ట్రేలియాకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ క్రమంలో సుహాసిని రెడ్డి ఈ నెల 19న ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. మానస సరోవరం యాత్రకు వెళ్లాలని భావించిన ఆమె.. తన స్నేహితురాలితో కలిసి మూడు నెలల ముందుగానే టికెట్లు బుక్‌ చేసుకున్నారు. సుహాసిని హైదరాబాద్‌ నుంచి బయలుదేరగా, ఆమె స్నేహితురాలు ఆస్ట్రేలియా నుంచి నేపాల్‌ రాజధాని ఖాట్మండుకు చేరుకున్నారు. అనంతరం ఇద్దరూ అక్కడ కలుసుకున్నారు.

టూర్స్‌ అండ్‌ ట్రావెల్స్‌ సంస్థ ద్వారా మొత్తం 29 మంది సభ్యులతో కలిసి మానస సరోవరం యాత్రకు వెళ్తున్నట్లు సుహాసిని తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే మంగళవారం రాత్రి 8 గంటల తర్వాత ఆమె ఫోన్‌ అందుబాటులోకి రాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది.

సుహాసిని వెళ్లిన ప్రాంతంలో భారీ వరదలు సంభవించినట్లు తెలియడంతో వారి ఆందోళన మరింత పెరిగింది. ఆమెతో ఫోన్‌లో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులు పలుమార్లు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదని తెలిపారు. ఇప్పటివరకు ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురవుతున్నారు.

నేపాల్‌లో చిక్కుకుపోయిన మానస సరోవరం యాత్రికుల వివరాలను వెంటనే సేకరించి వారి కుటుంబాలకు సమాచారం అందించాలని సుహాసిని కుటుంబ సభ్యులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. యాత్రికులందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
also read : నేపాల్‌ వరదల్లో మాజీ ఎమ్మెల్యే భార్య గల్లంతు.. 32 మంది యాత్రికుల కోసం గాలింపు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు