క్రైమ్ మిర్రర్ : నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలు కైలాస మానససరోవర యాత్రికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శుభ్రాన్షు రాయ్ భార్య శర్మిష్ట భౌమిక్ రాయ్ కూడా ఈ వరదల నేపథ్యంలో గల్లంతైనట్లు సమాచారం. ఆమెతో పాటు కోల్‌కతాకు చెందిన మరో 32 మంది యాత్రికుల బృందం కూడా ఆచూకీ లేకుండా పోయినట్లు తెలుస్తోంది.
శర్మిష్ట కోల్‌కతాకు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కైలాస మానససరోవర యాత్రకు వెళ్లారు. ఆగస్టు 21న నేపాల్ చేరుకున్న ఆమె.. ఆగస్టు 25న రాత్రి 11.30 గంటల సమయంలో భర్త శుభ్రాన్షు రాయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాను టిబెట్ సరిహద్దుకు సమీపంలోని కైరోంగ్ ప్రాంతంలో ఉన్నట్లు ఆ సమయంలో భర్తకు తెలిపారు. అయితే మరుసటి రోజు ఉదయం నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వరదలు సంభవించడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ తర్వాత శర్మిష్టతో కుటుంబ సభ్యులకు ఎలాంటి సంబంధాలు ఏర్పడలేదు. ఫోన్ ద్వారా సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు.
తన భార్య గల్లంతైన వారి జాబితాలో ఉన్నట్లు శుభ్రాన్షు రాయ్ ధ్రువీకరించినట్లు సమాచారం. ఆమె ఒక్కరే కాకుండా అదే యాత్ర బృందంలో ఉన్న మరో 32 మంది కోల్‌కతా వాసుల ఆచూకీ కూడా తెలియకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. తమ కుటుంబ సభ్యుల సమాచారం కోసం బాధితుల బంధువులు భారత రాయబార కార్యాలయాన్ని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సంప్రదించారు. గల్లంతైన యాత్రికుల ఆచూకీ కోసం అధికారుల సహకారంతో సమాచారం సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మరోవైపు నేపాల్–టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, రహదారులు దెబ్బతినడం, కమ్యూనికేషన్ వ్యవస్థలకు అంతరాయం ఏర్పడటం వంటి కారణాలతో సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. గల్లంతైన యాత్రికుల క్షేమ సమాచారం కోసం కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.
also read : సన్నీ లియోన్ దంపతులకు భారీ ఊరట.. చీటింగ్ కేసు కొట్టివేత
