క్రైమ్ మిర్రర్ : పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో తీవ్ర కలకలం రేపే ఘటన చోటుచేసుకుంది. మాల్దా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఒకే రోజు 10 మంది నవజాత శిశువులు మృతి చెందారు. ఈ ఘటన ఆగస్టు రెండో వారంలో చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వరుసగా చిన్నారులు మృతి చెందడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ దీనిపై నివేదిక కోరింది.
ఆసుపత్రి వైద్యాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతి చెందిన 10 మంది శిశువుల్లో ఎనిమిది మందిని ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రైవేట్ నర్సింగ్ హోమ్‌ల నుంచి అత్యవసర పరిస్థితుల్లో మాల్దా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి అప్పటికే అత్యంత విషమంగా ఉన్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ ప్రసేన్‌జిత్ బార్ తెలిపారు.
మిగిలిన ఇద్దరు శిశువులు మాత్రం మాల్దా మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలోనే జన్మించినట్లు అధికారులు వెల్లడించారు. మృతి చెందిన చిన్నారుల్లో కొందరు తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో బాధపడగా, మరికొందరికి పచ్చకామెర్లు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
బయట ఆసుపత్రుల నుంచి తీవ్ర పరిస్థితుల్లో వచ్చిన చిన్నారులకు అత్యవసర వైద్యం అందించినప్పటికీ వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రాణాలు కాపాడలేకపోయినట్లు ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఒకే రోజు 10 మంది నవజాత శిశువులు మృతి చెందడం పలు అనుమానాలకు దారితీయడంతో ఆరోగ్య శాఖ ఘటనపై దృష్టి సారించింది.
ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఆరోగ్య శాఖకు ప్రాథమిక నివేదిక సమర్పించినట్లు మెడికల్ సూపరింటెండెంట్ ప్రసేన్‌జిత్ బార్ తెలిపారు. మరిన్ని వివరాలను సేకరించి సమగ్ర నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తామని వెల్లడించారు. శిశువుల మృతికి సంబంధించిన కారణాలు, వారికి అందించిన చికిత్స, ఇతర ఆసుపత్రుల నుంచి రిఫర్ చేసిన పరిస్థితులపై అధికారులు పూర్తి స్థాయిలో పరిశీలన చేపడుతున్నారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ నివేదికలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read : వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన కారు.. మహిళ మృతి
