Homeఅంతర్జాతీయంనేపాల్‌కు మరో ముప్పు.. 72 గంటల్లో బ్యారియర్ సరస్సు పొంగే అవకాశం

నేపాల్‌కు మరో ముప్పు.. 72 గంటల్లో బ్యారియర్ సరస్సు పొంగే అవకాశం

క్రైమ్ మిర్రర్ : ఇప్పటికే భారీ ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్‌కు మరో ముప్పు పొంచి ఉంది. సరిహద్దు ప్రాంతంలోని ఓ సరస్సు రానున్న మూడు రోజుల్లో ఉప్పొంగే ప్రమాదం ఉందని చైనా హెచ్చరించింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజల్లో మరోసారి ఆందోళన నెలకొంది.

చైనా జల వనరుల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. నేపాల్ సరిహద్దుకు సమీపంలో చోచెన్ ఖోలా, పురెపు టాంగ్పో నదుల మధ్య ఉన్న బ్యారియర్ సరస్సులో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. గురువారం ఉదయం నాటికి సరస్సులో సుమారు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ప్రస్తుతం సరస్సు గరిష్ఠ స్థాయికి చేరుకుని ప్రవహిస్తున్న నేపథ్యంలో.. రానున్న 72 గంటల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల వరకు నీరు చేరే అవకాశం ఉందని చైనా అంచనా వేసింది. ఇదే జరిగితే సరస్సు కట్టలు దాటి దిగువ ప్రాంతాలను వరద ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో సరస్సులో నీటిమట్టాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు చైనా అధికారులు తెలిపారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ వరద ముప్పును అంచనా వేస్తున్నామని, అవసరమైతే సహాయక చర్యలు చేపట్టేందుకు సన్నద్ధంగా ఉన్నామని వెల్లడించారు.

ఇదిలా ఉండగా.. బుధవారం నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదలకు టిబెట్‌లో మంచు ఫలకం విరిగిపడటం కారణమై ఉండొచ్చన్న ప్రచారం జరుగుతోంది. ఈ వరదల ప్రభావం టిబెట్‌పైనా పడినట్లు చైనా తెలిపింది. టిబెట్‌లో ముగ్గురు మృతి చెందగా, 558 మంది గల్లంతైనట్లు పేర్కొంది.

నేపాల్‌లోనూ వరదలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. గల్లంతైన వారిలో సుమారు 100 మంది వరకు చైనా పౌరులు ఉన్నట్లు ఆ దేశం వెల్లడించింది. మరోవైపు నేపాల్‌లో వరదల కారణంగా మృతుల సంఖ్య 359కి చేరినట్లు సమాచారం. గల్లంతైన వారి కోసం రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

ఇప్పటికే వరదల నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్న నేపాల్‌కు.. మరో మూడు రోజుల్లో బ్యారియర్ సరస్సు ఉప్పొంగే అవకాశం ఉందన్న హెచ్చరిక మరింత ఆందోళన కలిగిస్తోంది. అధికారులు అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.
also read : గ్రామస్తులపై చిరుత దాడి.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు