-
విద్యార్థి వైద్య చికిత్సకు రూ.50,000 ఆర్థిక సహాయం
మంచిర్యాల, క్రైమ్మిర్రర్: మంచిర్యాల పట్టణంలోని రివిలేషన్ హై స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. పాఠశాలలో 4వ తరగతి చదువుతున్న షేక్ అమెర్ అనే విద్యార్థి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని, అతని వైద్య చికిత్స నిమిత్తం రూ.50,000 (యాభై వేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని కొంత మొత్తం ఫోన్ పే ద్వారా మరియు కొంత మొత్తం నగదు రూపంలో అందించారు.విద్యార్థి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఆ కుటుంబానికి అండగా నిలవాలనే సదుద్దేశంతో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించడం అభినందనీయమని నూతన విద్యావిధానం అధ్యయన యాత్రలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో ఉన్న రివిలేషన్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రాపోలు విష్ణువర్ధన్ రావు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు కేవలం పాఠ్యాంశాలను బోధించడమే కాకుండా వారిలో మానవీయ విలువలు, దయ, కరుణ, సేవాభావం, సామాజిక బాధ్యత, తోటి వారికి సహాయం చేసే గుణాన్ని పెంపొందించడం ప్రతి విద్యాసంస్థ యొక్క ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. “విద్య అంటే కేవలం మార్కులు, ర్యాంకులు, పుస్తక జ్ఞానం మాత్రమే కాదు… ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం, ఎదుటివారి బాధను అర్థం చేసుకోవడం, మానవీయ విలువలతో జీవించడమే నిజమైన విద్య” అని అన్నారు.
ఈ మానవతా కార్యక్రమంలో స్వచ్ఛందంగా భాగస్వాములైన ఉపాధ్యాయులు, విద్యార్థులు, సహకరించిన తల్లిదండ్రులందరికీ పాఠశాల యాజమాన్యం తరఫున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థి షేక్ అమెర్ త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి పాఠశాలకు వచ్చి తన చదువును కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ మద్దెర్ల ప్రశాంత్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
