పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్, యోగా గురు బాబా రాందేవ్‌కు సన్నిహితుడైన ఆచార్య బాలకృష్ణకు పాత పాస్‌పోర్ట్ కేసులో ఊరట లభించింది. సుమారు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ కేసులో డెహ్రాడూన్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో మరో నిందితుడిగా ఉన్న నరేశ్ చంద్ర ద్వివేదికి కూడా కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది.
అసలు కేసు ఏంటి?
నకిలీ విద్యార్హత పత్రాలను ఉపయోగించి భారత పాస్‌పోర్ట్ పొందారనే ఆరోపణలపై సీబీఐ 2011 జులైలో కేసు నమోదు చేసింది. బాలకృష్ణ నేపాల్‌కు చెందిన వ్యక్తి అని, 1998లో బరేలీ పాస్‌పోర్ట్ కార్యాలయంలో తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించి పాస్‌పోర్ట్ పొందారని దర్యాప్తు సంస్థ ఆరోపించింది.
పాస్‌పోర్ట్ కోసం సమర్పించిన విద్యా ధ్రువపత్రాల్లో ‘పూర్వ మధ్యమ’, ‘శాస్త్రి’ సర్టిఫికెట్లు ఉన్నాయని సీబీఐ పేర్కొంది. ఇవి వారణాసిలోని సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయానికి సంబంధించినవిగా దర్యాప్తులో వెల్లడైనట్లు ఛార్జిషీట్లో పేర్కొంది.
సీబీఐ వాదనను కోర్టు ఎందుకు అంగీకరించలేదు?
కేసు విచారణలో కీలకమైన ఆరోపణలను సీబీఐ పూర్తి స్థాయిలో నిరూపించలేకపోయిందని ప్రత్యేక కోర్టు అభిప్రాయపడింది. నకిలీ పత్రాలుగా పేర్కొన్న వాటికి సంబంధించి ఫోర్జరీని సందేహాలకు తావులేకుండా నిరూపించడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని కోర్టు తెలిపింది.
అలాగే అసలు ధ్రువపత్రాల కంటే ఫోటోకాపీల ఆధారంగా చేతిరాతను పరిశీలించడం వంటి అంశాలను కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అంతేకాకుండా బాలకృష్ణ అదే విశ్వవిద్యాలయం నుంచి తదుపరి విద్యను అభ్యసించిన అంశం కూడా విచారణలో ప్రాధాన్యం సంతరించుకుంది.
‘చివరకు సత్యమే గెలిచింది’- బాలకృష్ణ
కోర్టు తీర్పు అనంతరం ఆచార్య బాలకృష్ణ స్పందించారు. భారత న్యాయవ్యవస్థపై తనకు ఎప్పుడూ విశ్వాసం ఉందని చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా కొనసాగిన న్యాయపోరాటం, మానసిక ఒత్తిడి అనంతరం నిజం గెలిచిందని పేర్కొన్నారు.
ఈ కేసు సమయంలో తనకు అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, మద్దతుదారులకు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.
మొత్తంగా.. దాదాపు 15 ఏళ్లుగా కొనసాగిన పాస్‌పోర్ట్ ఫోర్జరీ కేసుకు ప్రత్యేక సీబీఐ కోర్టు తీర్పుతో ముగింపు లభించింది. బాలకృష్ణతో పాటు మరో నిందితుడు నరేశ్ చంద్ర ద్వివేది కూడా నిర్దోషులుగా బయటపడ్డారు.
also read: West Bengal: మైనర్ గర్భం దాల్చితే భర్తపై POCSO కేసు.. బాల్య వివాహాలపై సీఎం హెచ్చరిక
