Homeక్రైమ్విశాఖ మత్స్యకారుడి హత్య కేసు- ముందురోజే ‘నన్ను చంపేస్తారు’ అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన చంటి

విశాఖ మత్స్యకారుడి హత్య కేసు- ముందురోజే ‘నన్ను చంపేస్తారు’ అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన చంటి

ఫిషింగ్ హార్బర్ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద ఓ మత్స్యకారుడు అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. హత్యకు ముందు రోజే తనకు ప్రాణహాని ఉందంటూ కుటుంబ సభ్యులతో చెప్పిన వ్యక్తి.. మరుసటి రోజు విగతజీవిగా కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

విజయనగరం జిల్లా మక్కాం గ్రామానికి చెందిన మైలపల్లి చంటి (30) కొంతకాలంగా కుటుంబంతో కలిసి విశాఖ నగరంలోని పెయిందొరపేటలో ఉంటున్నారు. చేపల వేటే జీవనాధారంగా చేసుకున్న చంటికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే కుటుంబంలో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భార్యకు దూరంగా ఉంటూ తన సోదరి మెరుగు అప్పలకొండ ఇంట్లో చంటి నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి భోజనం సమయంలో చంటి తన సోదరితో తనకు ఎదురవుతున్న సమస్యల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. తనను ఎవరో హతమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని, తనకు ప్రమాదం ఉందని చెప్పి తీవ్ర ఆందోళనకు గురైనట్లు సమాచారం. భోజనం పూర్తయ్యాక ఇంటి నుంచి బయటకు వెళ్లిన చంటి తిరిగి ఇంటికి చేరుకోలేదు.

రాత్రి సమయం దాటినా చంటి ఇంటికి రాకపోవడంతో అప్పలకొండ ఆందోళన చెందారు. పోలీసులకు సమాచారం ఇవ్వాలని భావిస్తున్న సమయంలోనే ఫిషింగ్ హార్బర్ సమీపంలోని గంగాలమ్మ గుడి వద్ద చంటి మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తలపై తీవ్ర గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా మెడకు నైలాన్ తాడు బిగించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఇది హత్యేనని ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేశారు.

అయితే చంటిని హత్య చేసింది ఎవరు? అతడికి ఎవరితోనైనా పాత గొడవలు ఉన్నాయా? హత్యకు కుటుంబ విభేదాలే కారణమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ముందు చంటి చెప్పిన ‘నన్ను చంపేస్తారు’ అనే మాటలు ప్రస్తుతం కేసులో కీలకంగా మారాయి.

చంటికి గతంలో ఎవరైనా బెదిరింపులు చేశారా? ఘటనకు ముందు అతడిని ఎవరైనా కలిశారా? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని సమాచారం, చంటి వ్యక్తిగత వ్యవహారాలు, కుటుంబ నేపథ్యాన్ని పరిశీలిస్తూ హత్య వెనుక అసలు కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాతే ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

also read: పాస్‌పోర్ట్ ఫోర్జరీ కేసులో బాబా రాందేవ్ సన్నిహితుడికి భారీ ఊరట.. 15 ఏళ్ల తర్వాత కోర్టు కీలక తీర్పు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు