సోషల్ మీడియాలో రీల్స్, వీడియోల కోసం ప్రమాదకరమైన స్టంట్లు చేయడం ప్రాణాల మీదకు వస్తున్నాయి. వైరల్ కావాలనే ప్రయత్నంలో కొందరు తమ భద్రతను పూర్తిగా మరిచిపోతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఓ ఘటన ఇందుకు ఉదాహరణగా నిలిచింది.
ఝాన్సీకి చెందిన 32 ఏళ్ల పుష్పేంద్ర కుమార్ మనౌరియా తన స్నేహితులతో కలిసి పహుజ్ డ్యామ్ ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ సరదాగా వీడియో తీసుకునే క్రమంలో సుమారు 30 అడుగుల ఎత్తు నుంచి నీటిలోకి దూకాడు. ఈ దృశ్యాలను అతడి స్నేహితులు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశారు.
అయితే నీటిలోకి దూకిన సమయంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. డ్యామ్‌లో నీటి మట్టం, ప్రవాహం తక్కువగా ఉండటంతో పుష్పేంద్ర కాళ్లు కింద ఉన్న నేలను బలంగా తాకాయి. దీంతో అతడి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. పైకి లేచేందుకు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో చేతుల సహాయంతో సమీపంలోని రాళ్ల వద్దకు చేరుకున్నాడు.
వెంటనే అతడి స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఒక కాలికి శస్త్రచికిత్స చేసి రెండు స్టీల్ రాడ్లు అమర్చినట్లు సమాచారం. మరో కాలికి కూడా ఆపరేషన్ చేయాల్సి ఉందని తెలుస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన పలువురు నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని సెకన్ల ఫేమ్ కోసం ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టడం సరికాదని సూచిస్తున్నారు.
వైరల్ కావాలనే ఉద్దేశంతో ప్రమాదకరమైన ప్రదేశాల్లో స్టంట్లు చేయడం ఎప్పటికీ సురక్షితం కాదు. ఒక్క చిన్న పొరపాటు జీవితాంతం బాధపడే పరిస్థితిని తీసుకురావచ్చు. కాబట్టి రీల్స్ కోసం ప్రాణాలను పణంగా పెట్టే ప్రయత్నాలకు దూరంగా ఉండాలని నెటిజన్లు సూచిస్తున్నారు.
also read: విశాఖ మత్స్యకారుడి హత్య కేసు- ముందురోజే ‘నన్ను చంపేస్తారు’ అంటూ కుటుంబ సభ్యులకు చెప్పిన చంటి
