క్రైమ్ మిర్రర్ : మానస సరోవర్ యాత్రకు వెళ్లిన విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన ఓ తెలుగు ఎన్నారై కుటుంబం నేపాల్‌లో సంభవించిన వరదల్లో గల్లంతైనట్లు సమాచారం. లండన్‌లో స్థిరపడిన కుటుంబం యాత్రలో భాగంగా నేపాల్ మీదుగా మానస సరోవర్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పార్వతీపురానికి చెందిన సంతోష్ కుమార్ సాహు (47), ఆయన భార్య సురభి (43), కుమారుడు స్పందన్ (18), కుమార్తె సైనా సాహు (13) యాత్ర కోసం నేపాల్ వెళ్లారు. ఈ క్రమంలో కుటుంబం ప్రయాణిస్తున్న వాహనం ఓ వంతెనపైకి చేరుకున్న సమయంలో అకస్మాత్తుగా భారీ వరద ప్రవాహం రావడంతో వాహనం కొట్టుకుపోయినట్లు నేపాల్ గైడ్ సంతోష్ బంధువులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి కుటుంబంలోని నలుగురి ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వారిని గుర్తించేందుకు, సురక్షితంగా ఉన్నారో లేదో తెలుసుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
దక్షిణాఫ్రికాలో తల్లిదండ్రులు
సంతోష్ కుమార్ తల్లిదండ్రులు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తమ రెండో కుమారుడు మురళి వద్ద ఉన్నట్లు సమాచారం. నేపాల్‌లో తమ కుమారుడు, కోడలు, మనవడు, మనవరాలి ఆచూకీ తెలియకపోవడంతో వారు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. మరోవైపు నేపాల్‌లో వరదల తీవ్రత కొనసాగుతోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా పెద్దఎత్తున ప్రాణనష్టం సంభవించింది. అధికారుల సమాచారం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం వరకు వరదల కారణంగా మృతుల సంఖ్య 469కు చేరింది. గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
also read : నేపాల్ వరదల ఎఫెక్ట్.. 200 కి.మీ. కొట్టుకొచ్చిన మృతదేహాలు?
