Homeక్రైమ్అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య.. ఆగ్రాలో ప్రధాన నిందితుడి అరెస్ట్

అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య.. ఆగ్రాలో ప్రధాన నిందితుడి అరెస్ట్

అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన యువతి నిఖిత గొడిశాల (27) హత్య కేసులో తెలంగాణ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అనుమానిస్తున్న అర్జున్ శర్మను ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని అమెరికా అధికారులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

హైదరాబాద్‌లోని లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన నిఖిత గొడిశాల ఉన్నత విద్య కోసం సుమారు నాలుగేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. అక్కడ చదువుతో పాటు ఉద్యోగం కూడా చేస్తున్నట్లు సమాచారం.

ఈ ఏడాది జనవరి 2న నిఖిత కనిపించడం లేదంటూ ఆమె మాజీ రూమ్‌మేట్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అర్జున్ శర్మ అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేసిన అనంతరం అతడు భారత్‌కు తిరిగి వచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు.

అయితే అర్జున్ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే అతనికి సంబంధించిన అపార్ట్‌మెంట్‌లో నిఖిత మృతదేహం లభ్యమైంది. ఆమె శరీరంపై కత్తిపోట్ల ఆనవాళ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో, నిఖిత డిసెంబర్ 31న హత్యకు గురై ఉండవచ్చని దర్యాప్తు అధికారులు అనుమానించారు.

కుమార్తె మృతిపై నిఖిత తండ్రి ఆనంద్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె వద్ద అర్జున్ శర్మ డబ్బు తీసుకున్నాడని, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని నిఖిత కోరడంతోనే ఆమెను హత్య చేసి ఉండవచ్చని ఆయన ఆరోపించారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన హైదరాబాద్ పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తును ముమ్మరం చేశారు. అర్జున్ ఆచూకీని ట్రాక్ చేసిన అధికారులు చివరకు అతడు ఆగ్రాలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.

అనంతరం అర్జున్ శర్మను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. అమెరికా అధికారుల అభ్యర్థన నేపథ్యంలో అతడిని అమెరికాకు అప్పగించేందుకు సంబంధించిన న్యాయ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కేసులో హత్యకు దారితీసిన కారణాలు, నిందితుడి పాత్రపై మరింత సమాచారం దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.

also read: ‘టాక్సిక్‌’పై అన్నామలై సంచలన వ్యాఖ్యలు.. మహిళల చిత్రీకరణపై తీవ్ర అభ్యంతరం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు